తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే
గువాహటి: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నిజయోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్ అంటే షాజహాన్‌కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు’ అని ప్రశ్నించారు.
అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్ ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా భావిస్తే.. మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు. NCERT తాజాగా మొఘలులపై పాఠ్యాంశాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నాము.
కాగా మొఘల్ కాలం నాటి కట్టడాలైన తాజ్ మహల్, కుతుబ్ మినార్లను కూల్చివేసి.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు. నేటికి దీనిని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
Guwahati, Assam | Taj Mahal is not the symbol of Love. Shah Jahan built Tajmahal in memory of his 4th wife Mumtaz. If he loved Mumtaz, then why he married three times more after the death of Mumtaz: BJP leader Rupjyoti Kurmi (05.04)
— ANI (@ANI) April 6, 2023