ముందిరక్కాడులో పోలీస్ అధికారిగా సీమాన్
నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజా పోరాటం చేస్తున్న సినీ దర్శకుడు సీమాన్ సుదీర్ఘ విరామం తరువాత ముందిరకాడు అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.అలాగే కారు విపత్తుకు గురై కొంత కాలంగా సినిమాకు దూరంగా ఉన్న దర్శకుడు కళైంజియం తాజాగా కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని వహిస్తున్న చిత్రం ముందిరక్కాడు. తమిళన్ కలై పంబాట్టు ఇయక్కమ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో పుగళ్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇండియన్ కమ్యునిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు సి.మహేంద్రన్ కొడుకు అన్నది గమనార్హం. సుప్రియ కథానాయకిగా నటిస్తుండగా ఇతర ముఖ్యపాత్రల్లో జయకర్, సోము, శక్తివేల్,ఆంబళ్తిరు, కలైశేఖర్, పావల లక్ష్మణన్ నటించారు.ఏకే.ప్రియన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కళైంజియం తెలుపుతూ ఇది ముందిరక్కాడు ప్రాంత జన జీవనాన్ని యదార్థంగా ఆవిష్కరించే కథా చిత్రం అని వివరించారు. ఇందులో అంబరసన్ అనే పోలీస్ అధికారిగా సీమాన్ నటిస్తుండడం విశేషం అన్నారు.
ముందిరక్కాడు ప్రజల జీవన విధానాన్ని వారి సమస్యల్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు తెలిపారు.ఆ ప్రాంత ఓ యువ జంట ప్రేమను ఆ ఊరే వ్యతిరేకిస్తే పోలీస్ అధికారి సీమాన్ ఆ జంటను కలపడానికి ప్రయత్నిస్తారన్నారు. ఆయన ప్రయత్నం సఫలం అయ్యిందా? లేదా? ఇత్యాది పలు ఆసక్తికర అంశాల సమాహారంగా ముందిరక్కాడు చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను తంజావూర్,నెల్లై చిల్లాలతో పాటు చెన్నై,ఆంధ్ర ప్రాంతంలోని నగరి ప్రాంతాల్లో 40 రోజుల పాటు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కడలూరు, పాండీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.