Muni 3
-
ఆ నరకమే హాయిగా అనిపించింది!
‘‘గ్లామర్ పాత్రలకే పరిమితమైపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. దాంతో పాటే ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తాను. అందుకే విభిన్నంగా ఉండే పాత్రకు అవకాశం వస్తే.. ఎంతైనా కష్టపడటానికి నేను రెడీ’’ అని తాప్సీ చెప్పారు. అన్నట్లుగానే ‘ముని 3’ కోసం బాగా కష్టపడుతున్నారామె. ఈ చిత్రం కోసం తీసిన ఓ సన్నివేశం కోసం తొమ్మిది గంటల పాటు ఆమె నీళ్లల్లో ఉండాల్సి వచ్చింది. రెండు రోజుల్లో తీద్దామని దర్శకుడు లారెన్స్ అన్నప్పటికీ ఒకే రోజులో తీస్తేనే ఎమోషన్ సరిగ్గా పండుతుందని తొమ్మిది గంటలు నీళ్లల్లో ఉన్నారట. ఫలితంగా నీటిలోంచి బయటికొచ్చేసరికి తాప్సీ ఒళ్లంతా నానిపోయిందట. అయినా తేలిగ్గా తీసుకున్నానని తాప్సీ అంటున్నారు. ఇంకా ఈ చిత్రం కోసం చేసిన మరో క్లిష్టమైన సన్నివేశం గురించి తాప్సీ చెబుతూ -‘‘చెన్నయ్ బీచ్‌లో ఈ యాక్షన్ సీన్ చేశాం. బీచ్‌లోని ఇసుకలో నన్ను ఈడ్చుకెళ్లేట్లు సీన్ అన్నమాట. ఇసుక, చిన్న చిన్న రాళ్లతో నా వళ్లు హూనం అయిపోయింది. ఈ ఫైట్‌ని మూడు రోజులు చేశాం. నరకం కనిపించింది. కానీ, ఆ నరకమే హాయిగా అనిపించింది. ఎందుకంటే, నటిగా పూర్తి సంతృప్తి లభించింది’’ అని చెప్పారు. -
డిసెంబర్లో ముని 3
ప్రయోగాలు చేసే దర్శకులలో నృత్య దర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒకరు. ముని, ముని-2గా కాంచన చిత్రాలను తెరకెక్కించి హారర్ చిత్రాల ట్రెండ్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చిన లారెన్స్ తాజాగా ముని-3గా గంగ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాప్సీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఒరు టిక్కెటిల్ రెండు సినిమా ఒండ్రు కిళవన్ ఒండ్రు కరుప్పుదురై అనే వైవిధ్య భరిత చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో రాఘవ లారెన్స్ వెల్లడిస్తూ ఈ చిత్రాన్ని రెండు కథలుగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. చిత్రం తొలి భాగంలో తనకు జోడిగా ఆండ్రియూ నటించనుండగా రెండో భాగంలో నటి రాయ్‌లక్ష్మి నటించనున్నారని వివరించారు. తమిళ వెర్షన్‌కు గీత రచయిత వివేక్ సంభాషణలందిస్తున్నారని తెలిపారు. -
ఆ ఒక్కరోజు మాత్రం లవర్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది!
నాన్‌స్టాప్‌గా పని చేసినప్పుడు కొంత రిలాక్స్ అయితే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. ఇటీవల తాప్సీకి అలానే అనిపించింది. హిందీ చిత్రం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ కోసం 45 రోజుల పాటు గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొన్నారామె. అందుకని ఐదు రోజులు బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. ఈరోజుతో ఆ బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టి, ‘ముని 3’ చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నారు. సినిమాల సంగతి అలా ఉంచితే.. తాప్సీ లవ్‌లైఫ్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు తను అస్సలు ప్రేమలో పడలేదట. దీని గురించి తాప్సీ మాట్లాడుతూ -‘‘ఇప్పుడున్నంత అందంగా అప్పట్లో నేను ఉండేదాన్ని కాదు. అందుకే ఐ లవ్ యు చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. ఇప్పుడు నేను అందంగా ఉన్నా ఎవరూ ఐ లవ్ యు చెప్పడంలేదు. దానికి కారణం ఇప్పుడు నేను స్టార్‌ని. చెంపలు వాయించేస్తానని భయపడుతున్నారేమో. అయినా ఈ సింగిల్ లైఫ్ బాగానే ఉంది. కానీ, ప్రేమికుల దినోత్సవం నాడు మాత్రం మనకు లవర్ ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఎందుకంటే, ప్రేమికులందరూ బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం, ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు కబుర్లు చెప్పుకోవడం చూస్తే భలే అనిపిస్తుంది’’ అని చెప్పారు. -
ముని-3లో నిత్యామీనన్
ముని-3 చిత్రంలోకి నటి నిత్యామీనన్ వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం గంగా. ఇది ఆయన ఇంతకుముందు రూపొందించిన ముని, కాంచన చిత్రాలకు సీక్వెల్. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. తాజాగా నిత్యామీనన్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె ఒక ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తుండం విశేషం. షూటింగ్లో కాలికి బలమైన గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు మూడు నెలలు విశ్రాంతి తీసుకున్న లారెన్స్ తాజాగా చిత్ర షూటింగ్‌కు సిద్ధమయ్యారు. చెన్నైలో వేసిన భారీ సెట్లో ముని -3 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇందులో నిత్యామీనన్ దెయ్యంగా ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే దెయ్యం పాత్ర అయినా చాలా రొమాంటిక్‌గా ఉంటుందట. హీరోయిన్గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ తాజాగా జేకే ఎండ్రుం ఒరు నన్బనిన్ కథై చిత్రంతో కోలీవుడ్లోను మంచి పేరు తెచ్చుకుంది. త్వరలో ఈ బ్యూటీ నటించిన మాలిని 22 పాలైయంకోట్టై చిత్రం తెరపైకి రానుంది. ఇలాంటి సమయంలో ముని -3 లో దెయ్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది.