ఏపీలో తప్ప నాకెక్కడా పరిశ్రమలు లేవు- గల్లా జయదేవ్
- స్వచ్ఛభారత్‌ను తొలుత ప్రవేశపెట్టింది చంద్రబాబేనని వెల్లడి
మంగళగిరి : తనకు ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మరే రాష్ట్రంలోనూ పరిశ్రమ లేదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం మున్సిపల్ అతిథి గృహాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన మీరు ప్రత్యేక హోదా గల రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టడానికి కారణమేమిటని విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. తొలుత ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో ఎవరూ రాజీపడడం లేదని, ప్యాకేజీతోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవచ్చని దీనికి అంగీకరించడం జరిగిందని చెప్పారు.
విభజన చట్టంలో హామీలను సాధించడంతోపాటు మరిన్ని నిధులను సాధించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వచ్ఛభారత్‌పై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు గత పరిపాలనలోనే క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.