ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరికి గాయాలు
మునిమడుగు (పెనుకొండ రూరల్) : మండలంలోని మునిమడుగులో శనివారం పాతకక్షల కారణంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో ఇరువర్గాలకు చెందిన ఎనిమిది మందిపై రౌడీషీట్ తెరిచినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు. ఎస్ఐ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనిల్, శ్రీనివాసులు కుటుంబాలకు ఇది వరకే పాతకక్షలు ఉన్నాయి.
అయితే శనివారం సాయంత్రం అనిల్ గ్రామరచ్చకట్టవద్ద నిలబడి ఉండగా శ్రీనివాసులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చి అకారణంగా అనిల్‌ను దూషిం చాడు. అనంతరం అనిల్ తల్లి మంగమ్మపై శ్రీనివాసులు బంధువులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అనిల్ వర్గీయులు సైతం శ్రీనివాసులు వర్గంపై దాడికి దిగారు.
ఈ దాడిలో శ్రీనివాసులు తల్లి రమణమ్మకూ స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరు మహిళల్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన అనిల్, నాగరాజు, మంగమ్మ, నాగేంద్ర, శ్రీనివాసులు, వెంకటేశులు, రమణమ్మ, కవితపై రౌడీషీట్ నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.