రిజర్వేషన్ తొలగింపు వెనుక ‘బాబు’ కుట్ర
మున్నూరుకాపులను ఓబీసీ నుంచి తొలగిస్తే పోరాటం
రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్
ఆదిలాబాద్ టౌన్ : మున్నూరు కాపు కులస్తులను ఓబీసీ నుంచి తొలగిస్తే పోరాటం చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంత్‌రావు అన్నారు. రిజర్వేషన్ తొలగింపు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీబీసీ నివేదికను కేంద్ర ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కులానికి చెందిన వారే అయినప్పటికీ బీసీల సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. బీసీలకు 25 శాతం రిజర్వేషన్ ఉన్నా.. 10 శాతం కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఎలాంటి సర్వేలు చేయకుండా ఏ కొలమానంతో ప్రధానమంత్రి రిజర్వేషన్ తొలగించడానికి కుట్రపన్నుతున్నారని ప్రశ్నించారు.
మున్నూరుకాపులో చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, కొంతమంది ధనవంతులను చూసి ఓబీసీ నుంచి తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మున్నూరు కాపులు ఏకమై 15 రోజులల్లో కార్యాచరణ తయారు చేసి ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లామోనని బాధపడుతున్నారని, త్వరలో వారు తిరిగి వస్తారని పేర్కొన్నారు. పుటకో మాట చేప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొదండరెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్, సతీష్‌రావు, షఖీల్ పాల్గొన్నారు.