గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు పోలీసుల నుంచి లైన్‌క్లియర్ అయ్యింది. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఉద్యమం నుంచి బయటకు వచ్చిపోలీసులకు లొంగిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసు శాఖ గణపతి సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని ప్రకటించారు. గణపతి లొంగిపోవాలి అనుకుంటే కుటుంబసభ్యుల, బంధువులతో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. రానున్న రెండురోజుల్లో లొంగిపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు, ఆయన అంగరక్షకులు కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు అనుభవించారు. అనారోగ్య కారణాలతో 2018 లో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అయితే లొంగుబాటుపై ఆయన తీసుకునే అనూహ్య నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.