రామోజీరావుకు తొత్తులా..?
కార్మికశాఖ అధికారులపై ఫిల్మ్‌సిటీ కార్మికుల ఆగ్రహం
తమకు వ్యతిరేకంగా యాజమాన్యం తెచ్చుకున్న స్టే ఎత్తివేయించాలని ధర్నా
సాక్షి,హైదరాబాద్: కార్మికులకు,కార్మికశాఖకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ సలహాదారు ఎం.బాబ్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, ప్రధానకార్యదర్శి జి.సైదులు మాట్లాడుతూ..హక్కుల పరిరక్షణకు సంబంధించి రామోజీ ఫిల్మ్‌సిటీ కార్మికుల వివాదాన్ని అప్పటి జాయింట్లేబర్ కమిషనర్ మురళీసాగర్ లేబర్‌కోర్టు-1 కు పంపించగా, కోర్టు దాన్ని పారిశ్రామిక వివాదం 43/2012గా నమోదు చేసిందని చెప్పారు. దీనిపై రామోజీ యాజమాన్యం హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేశారని వెల్లడించారు.
యాజమాన్యం మళ్లీ 2013 ఫిబ్రవరి 4న హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయమూర్తులు ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. ఐడీ 43/2012 ప్రొసీడింగ్స్‌పై స్టే విధించారన్నారు. అయితే ఏడాదవుతున్నా కార్మికశాఖ తరపున కోర్టులో కౌంటరు దాఖలు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికశాఖ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు ఫిల్మ్‌సిటీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ స్టేఎత్తివేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు.
రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలతో విసిగిపోయి 2008 యూనియన్ పెట్టుకున్నట్లు గుర్తుచేశారు. వేతనాల పెంపు, ఉద్యోగభద్రత తదితర న్యాయమైన డిమాండ్ల సాధనకు నోటీసిస్తే పరిష్కరించాల్సిన యాజమాన్యం..కార్మికులపై కక్షసాధింపునకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా జేసీఎల్ అజయ్‌ను కలిసి రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను వెకేట్ చేయించేందుకు సత్వరమే కౌంటర్ దాఖలు చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నర్సింహారావు, పీవీఎస్ నాయుడు, కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, మహేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.