muramanda
-
మెడలే ‘బుల్’డోజర్లు.. గిట్టలే బుల్లెట్లు..
-మురమండలో ఉత్కంఠభరితంగా ఎడ్లపట్టు ప్రదర్శన -‘మీరా, మేమా’ అన్నట్టు తలపడ్డ 11 జతల నందులు –విజయకేతనం ఎగరేసిన మురమండ ఎడ్లు కడియం : ఈతలో ఆరితేరిన వారికైనా వరదలో వాలుఈత మాత్రమే తేలిక. అదే ఎదురీదమంటే..ఒక బార ఈదేసరికి పదిబారలు వెనక్కు నెట్టుకుపోతుంది ప్రవాహం. అలాంటి ఎదురీతే ఎడ్ల పట్టు ప్రదర్శన. చక్రాలను కదలకుండా కట్టేసి, నిర్ణీతదూరానికి బండిని లాక్కుని వెళ్లాలనన్న నిబంధనతో జరిగే ఈ ప్రదర్శన నందుల నిజమైన బలానికి గీటురాయి. మండలంలోని మురమండ గ్రామ శివార్లలో గల శ్రీ సందన్నబాబు తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్ల పట్టు ప్రదర్శన బుధవారం ఉత్సాహంగా జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 11 జతల ఎడ్లు తమ బలాన్ని ప్రదర్శించడంలో ‘మీరా, మేమా’ అన్నట్టు హోరాహోరీగా తలపడ్డాయి. చక్రాలు కట్టేసిన బండి (దాదాపు టన్ను బరువు)ని నిర్ణయించిన దూరం వరకూ లాక్కెళ్లడంలో తమ సత్తా చూపాయి. కాడి మోపిన మెడను ‘బుల్’డోజర్లా, నేల మీద ఆనిన గిట్టలను బుల్లెట్లలా చేసి.. ఎడ్ల జతలు బండ్లను ‘బరబరా’ లాగుతుంటే చూసే వారు ఉత్తేజభరితులయ్యారు. కేరింతలు, ఈలలతో ఈ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రదర్శనలో పోటీ పడ్డ ఎడ్ల జతలన్నీ కొన్ని క్షణాల తేడాతోనే లక్ష్యాన్ని చేరుకుంటుండడంతో.. ఎవరి నందుల జంట గెలుపుగంట మోగిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో నిండింది. చివరికి మురమండ గ్రామానికి చెందిన మొగలపు సత్యనారాయణకు చెందిన ఎడ్ల జత నిర్ణీత దూరాన్ని 21.52 సెకన్లలో చేరుకుని మొదటి స్థానాన్ని దక్కించుకుంది. చింతల నామవరం గ్రామానికి చెందిన ఈలి మూసలయ్యకు చెందిన ఎడ్ల జత 22.45 సెకన్లలో, ఏడిద సావరం గ్రామానికి చెందిన టేకిమూడి సత్యనారాయణకు చెందిన ఎడ్ల జత 22.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ద్వితీ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగదు ప్రోత్సాహకంతో పాటు, షీల్డులను నిర్వాహకులు అందజేశారు. -
నవవరుడి ఆత్మహత్య!
కడియం : వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియం మండలం మురమండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు (27) మహబూబాబాద్‌లో స్వీట్‌స్టాల్ నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 2వ తేదీన వివాహం జరిగింది. 3వ తేదీన నూతన వధూవరులు అన్నవరం కూడా వెళ్లి వచ్చారు. అయితే తెల్లవారుజామున మురమండలో సదరు యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి ఆత్మహత్యకు కారణాలేంటన్నది తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ఇరువైపుల వారు ఎందుకు మృతి చెందాడన్నదానిపై సమాధానం చెప్పలేకపోతున్నారని వారు చెబుతున్నారు. శ్రీనివాసరావు తండ్రి బంటు చిన్నబ్బాయి ఫిర్యాదు మేరకు కడియం ఎస్ఐ ఎల్. గౌరీనాయుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
విద్యుత్ తీగ తెగిపడి చెరకు తోట దగ్ధం
మురమండ (కడియం), న్యూస్‌లైన్ : చెరకు తోటపై విద్యుత్ తీగ తెగిపడ్డ సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల నష్టం వాటిల్లింది. స్థానిక కల్యాణ మండపం సమీపంలోని పుంత రోడ్డులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో గారపాటి సత్తిబాబుకు చెందిన సుమారు ఐదెకరాల చెరకు తోట పూర్తిగా కాలిపోయింది. తెగిపడిన తీగ మిగిలిన వాటిని తాకుతూ కిందపడింది. దీంతో రెండు స్తంభాల మధ్యనున్న తీగల వెంబడి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో తోటంతా మంటలు వ్యాపించాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తీగలు తెగిపడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో సమీపంలోనే చెరకు తోటలు కొట్టే కూలీలు ఉన్నారు. వారు కొంతమేర చెరకును నరికివేయడంతో మంటలు పక్కనున్న తోటలకు వ్యాపించలేదు. చేతికొచ్చిన తోట ఇలా కాలిపోవడంతో రైతు సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని, ప్రమాదం కారణంగా కనీసం పెట్టుబడి కూడా రాదని చెప్పాడు. మండపేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేశారు.