మెడలే ‘బుల్’డోజర్లు.. గిట్టలే బుల్లెట్లు..
మెడలే ‘బుల్’డోజర్లు.. గిట్టలే బుల్లెట్లు..
Published Wed, Mar 29 2017 10:39 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
-మురమండలో ఉత్కంఠభరితంగా ఎడ్లపట్టు ప్రదర్శన
-‘మీరా, మేమా’ అన్నట్టు తలపడ్డ 11 జతల నందులు
–విజయకేతనం ఎగరేసిన మురమండ ఎడ్లు
కడియం : ఈతలో ఆరితేరిన వారికైనా వరదలో వాలుఈత మాత్రమే తేలిక. అదే ఎదురీదమంటే..ఒక బార ఈదేసరికి పదిబారలు వెనక్కు నెట్టుకుపోతుంది ప్రవాహం. అలాంటి ఎదురీతే ఎడ్ల పట్టు ప్రదర్శన. చక్రాలను కదలకుండా కట్టేసి, నిర్ణీతదూరానికి బండిని లాక్కుని వెళ్లాలనన్న నిబంధనతో జరిగే ఈ ప్రదర్శన నందుల నిజమైన బలానికి గీటురాయి. మండలంలోని మురమండ గ్రామ శివార్లలో గల శ్రీ సందన్నబాబు తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్ల పట్టు ప్రదర్శన బుధవారం ఉత్సాహంగా జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 11 జతల ఎడ్లు తమ బలాన్ని ప్రదర్శించడంలో ‘మీరా, మేమా’ అన్నట్టు హోరాహోరీగా తలపడ్డాయి. చక్రాలు కట్టేసిన బండి (దాదాపు టన్ను బరువు)ని నిర్ణయించిన దూరం వరకూ లాక్కెళ్లడంలో తమ సత్తా చూపాయి. కాడి మోపిన మెడను ‘బుల్’డోజర్‌లా, నేల మీద ఆనిన గిట్టలను బుల్లెట్లలా చేసి.. ఎడ్ల జతలు బండ్లను ‘బరబరా’ లాగుతుంటే చూసే వారు ఉత్తేజభరితులయ్యారు. కేరింతలు, ఈలలతో ఈ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రదర్శనలో పోటీ పడ్డ ఎడ్ల జతలన్నీ కొన్ని క్షణాల తేడాతోనే లక్ష్యాన్ని చేరుకుంటుండడంతో.. ఎవరి నందుల జంట గెలుపుగంట మోగిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో నిండింది. చివరికి మురమండ గ్రామానికి చెందిన మొగలపు సత్యనారాయణకు చెందిన ఎడ్ల జత నిర్ణీత దూరాన్ని 21.52 సెకన్లలో చేరుకుని మొదటి స్థానాన్ని దక్కించుకుంది. చింతల నామవరం గ్రామానికి చెందిన ఈలి మూసలయ్యకు చెందిన ఎడ్ల జత 22.45 సెకన్లలో, ఏడిద సావరం గ్రామానికి చెందిన టేకిమూడి సత్యనారాయణకు చెందిన ఎడ్ల జత 22.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ద్వితీ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగదు ప్రోత్సాహకంతో పాటు, షీల్డులను నిర్వాహకులు అందజేశారు.
Advertisement
Advertisement