చెరువులో కాడెడ్ల బండి బోల్తా
చెరువులో కాడెడ్ల బండి బోల్తా
Published Mon, Aug 7 2017 11:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
రైతు, ఎద్దు మృతి
గొల్లప్రోలు (పిఠాపురం) : ఇరవై ఏళ్లుగా కాడేడ్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోన్న ఒక రైతును చెరువు మృత్యువు కబళించింది. చేబ్రోలులోని రథంబాట వీధికి చెందిన యాదాల సత్తిబాబు (46) ప్రమాదవశాత్తు గ్రామ శివారున ఉన్న కోటలంకవారి చెరువు (పెదచెరువు)లో పడి సోమవారం మృతి చెందాడు. అప్పటివరకు పొలంలో పట్టి చదును చేసిన ఆయన ఎడ్లకు నీరు పెట్టడానికి బండిని చెరువులోకి దించాడు. బండి అదుపు తప్పి బోల్తా పడింది. బండిపై ఉన్న సత్తిబాబు నీటిలో మునిగిపోయాడు. స్థానికులు అతడిని వెలికితీశారు. అప్పటికే అతడు మృతి చెందాడు. కాడెడ్లలో ఒక ఎద్దు ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటన పలువురు హృదయాలను కలచివేసింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై బి.శివకృష్ణ సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గ్రామంలో విషాద ఛాయలు
రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై పడి రోధించిన తీరు పలువుర్ని కలచివేసింది. మృతుడికి భార్య, కుమారుడు సింహాదికర, కుమార్తె శివచక్రవేణి ఉన్నారు. ఇటీవల చెరువులో తవ్విన గోతులే ప్రాణాలు తీశాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు గట్టుకు సమీపంలో లోతైన గోతుల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
Advertisement
Advertisement