
ఇబ్రహీంపట్నం రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కుటుంబ యజమాని భార్య, ఇద్దరు పిల్లలను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. హైదరాబాద్ సంతోష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఖుద్దూస్ (37), ఫాతిమా (27) దంపతులకు మెహక్‌బేగం (9), ఫిర్దోస్ బేగం (6) సంతానం. వీరు అదే ప్రాంతంలోని సలావుద్దీన్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఖుద్దూస్ బడంగ్‌పేట్‌లో వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇటీవల ప్రమాదానికి గురై నడుం నొప్పితో బాధపడుతున్న ఖుద్దూస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో సాఫీగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. పైగా ఆర్థిక ఇబ్బందులు తోడవంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. రెండు రోజుల క్రితం బావమరిది హమీద్‌ను రూ.10 వేలు అప్పు ఇప్పించాలని ఖుద్దూస్ అడగగా.. రెండు మూడు రోజుల తర్వాత చూద్దామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన ఖుద్దూస్..
భార్యను,ఇద్దరు పిల్లలను షాహీనగర్‌కు వెళదామని చెప్పి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మల్లాపూర్ చౌరస్తా నుంచి నేరుగా వెళ్లకుండా వాహనాన్ని కుర్మల్‌గూడ వైపు దారి మళ్లించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో కుర్మల్‌గూడ అంతిరెడ్డి చెరువు వద్ద ద్విచక్ర వాహనం నిలిపాడు. ముందుగా పిల్లలు, భార్యను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పిల్లలను చెరువులో ముంచుతుండగా.. అరుపులు వినిపించడంతో గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో ఖుద్దూస్, చిన్న కూతురు ఫిర్దోస్ బేగం మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం భార్య ఫాతిమా బేగం, మెహక్‌బేగం మృతదేహాలను బయటికి తీశారు. ఖుద్దూస్ బావమరిది హమీద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: ఫేస్‌బుక్ లవ్.. లవర్ కోసం నదిలో ఈది భారత్‌లోకి వచ్చాక.. షాకింగ్ ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment