ఈ ఆంబోతు ప్రాణం తీసింది..!
ఆంబోతు పొడిచిన ఘటనలో వృద్ధుడి మృతి
ఫిరంగిపురం: ఆంబోతు దాడిలో వృద్ధుడు ప్రాణాలు విడిచిన ఘటన ఫిరంగిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని అల్లంవారిపాలెంకు చెందిన పుసులూరి వెంకటేశ్వర్లు(70) ఎప్పటిలాగే ఉదయాన్నే సత్తెనపల్లి బస్టాండ్ సెంటర్‌లో టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. ఆదే సమయంలో రోడ్డు పక్కన వున్న ఆంబోతు ఒక్కసారిగా పెద్దగా రంకెలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేయడంతో స్థానికులు పరుగులు తీశారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పరుగు తీయలేక పోవడంతో ఆంబోతు దాడి చేసి పొట్టభాగంలో కొమ్ములతో పొడిచింది. వృద్ధుడు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు కూడా తీవ్ర గాయమైంది. తేరుకున్న స్థానికులు ఆంబోతును తరిమేశారు. వెంకటేశ్వర్లును సమీపంలోని ప్రైౖ వేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు∙వైద్యులు నిర్ధారించారు. ఊహించని ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
గతంలో కూడా....
ఫిరంగిపురం, రేపూడి, గొల్లపాలెం గ్రామాలకు చెందిన వారు ఆవులు, ఎద్దులను దేవాలయాలకు మొక్కుబడుల్లో భాగంగా ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు 20 వరకు ఆవులు, ఎద్దులు రోడ్డు వెంటనే తిరుగుతూ వాహనాల రాకపోకలకు అంతరాయంగా మారుతున్నాయి. గతంలో కూడా రోడ్డు వెంట నిలుచున్న, నడుచుకుంటూ వెళ్ళేవారి వెంట పడి పొడవడం, వెనుకవైపు నుంచి వచ్చి దాడిచేయడంతో కాళ్ళు, చేతులు విరిగిన వారు ఉన్నారు. ఇలా బాధితులుగా మారిన వారు 15 మందికి పైగా ఉంటారని అంచనా. ఇది సమస్యగా మారినా అటు దేవాదాయశాఖ గాని, పంచాయతీ అధికారులుగానీ ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం విమర్శలకు దారితీస్తోంది.