'చంపేస్తారని భయంగా ఉంది'
ముషీరాబాద్: భర్త, అత్తమామల వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సై అమ్జద్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్కు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె యశస్విని (23) సరూర్‌నగర్‌లో నివసించే పాండు రంగయ్య, లక్ష్మీభాయి కుమారుడు నరేష్‌కు ఇచ్చి మూడేళ్లక్రితం వివాహం జరిపించారు. రూ.రెండు లక్షలు, ఆరు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు.
ప్రస్తుతం నరేష్‌కు ఒక బాబు, పెళ్లయిన కొద్ది రోజులకే భర్త, అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి. తాజాగా వారి మకాంను సరూర్‌నగర్ నుంచి గాంధీనగర్‌కు మార్చారు. శనివారం యశస్విని తల్లికి ఫోన్ చేసి తనను విపరీతంగా వేధిస్తున్నారని, చంపేస్తారని భయంగా ఉందని ఫోన్ చేసి పెట్టేసింది. కొద్ది సేపటికే ఘర్షణ కావడంతో బాత్రూంలో ఉపయోగించే యాసిడ్ తాగింది.
తమను బదనాం చేయాలని యాసిడ్ తాగుతావా? అంటూ మళ్లీ తిట్టడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుంది. గమనించి ఆమెను వెంటనే సమీపంలోని కేఆర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తండ్రి వెంకటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు నరేష్, తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.