అలా మొదలైంది!
చిన్నతనం నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇళయరాజా, ఏ.ఆర్. రె హ్మాన్ స్వరాలంటే మరీ’’ అని సంగీత దర్శకుడు వేద అన్నారు. మనోజ్, రెజీనా జంటగా నటించిన ‘శౌర్య’ ద్వారా ఆయన సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ సోదరుడు ఈయన. ‘శౌర్య’ సినిమాకి తనకు అవకాశం దక్కడం గురించీ, ఇతర విశేషాల గురించీ వేద మాట్లాడుతూ - ‘‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంగీతం మీద దృష్టి పెట్టలేకపోయాను. పూర్తిగా చదువు మీద ఫోకస్ చేశాను. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాను. ఆ తర్వాత అనూప్ రూబెన్స్ దగ్గర రాత్రి సమయాల్లో భక్తి పాటలకు పనిచేశా.
ఓసారి దేవిశ్రీ ప్రసాద్‌గారికి నా డెమో ఆల్బమ్ పంపిస్తే, ఆయన చెన్నైకు పిలిపించి, అప్రెంటిస్‌గా చేర్చుకున్నారు. నా సినీ సంగీత ప్రయాణం అలా మొదలైంది. ఆ తర్వాత చక్రిగారి దగ్గర వర్క్ చేశాను. దర్శకుడు దశరథ్ తమ్ముడిగా నాకు ‘శౌర్య’ అవకాశం రాలేదు. సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. నేనెవరో చెప్పకుండానే మనోజ్‌గారికి రెండు సిచ్యుయేషన్స్‌కు తగ్గట్టు పాటలు స్వరపరిచి, వినిపించా. అవి నచ్చడంతో ఈ చిత్రానికి మ్యూజిక్ డెరైక్టర్‌గా అవకాశం వచ్చింది’’ అని చెప్పారు.