యోగ వైభవం
నేడు వరల్డ్ మ్యూజిక్ యోగా
⇒కిర్రాక్ పుట్టిస్తున్న సిటీ డీజేలు, ఆర్జేలు
⇒ప్రతి వేడుకలోనూ వీరిదే సందడి
⇒కొత్తగా వచ్చిన క్రేజీ కరౌకే..
⇒ర్యాక్ బ్యాండ్లతో కేక పుట్టిస్తున్న సిటీ యూత్
⇒ఆదాయ మార్గంగా మలచుకుంటున్న కుర్రకారు
⇒మ్యూజిక్ టూర్లతో స్పెషల్ అట్రాక్షన్
జంట నగరాల్లో జంట వేడుకలు. మన దేశంలో ఊపిరిపోసుకుని విశ్వవ్యాప్తం అయిన ఆరోగ్య సాధనం ఒకటైతే... మన అభిరుచుల్లో ఒదిగిపోతూ మనల్ని నీడై తోడై అనుసరించే విశ్వజనీన ఆనంద మార్గం మరొకటి. అభివృద్ధి పథంలో పయనిస్తూనే ఆరోగ్య సమస్యల్నీ పోగు చేసుకుంట్ను నగరజీవికి ‘యోగా’ను మించిన ఆరోగ్య సాధనం కనపడడం లేదు. ఉరుకులు పరుగుల జీవితంలో కాసింత ఉల్లాసం కావాలంటే సంగీతాన్ని మించిన సాంత్వన ‘వినపడడం’ లేదు. అందుకే యోగా బాట పట్టి, రాగాలను ఒడిసిపట్టిన నగరజీవి ఆరోగ్య..
ఆనంద అన్వేషణకు నేటి మా ప్రత్యేక కథనాలే ‘సాక్షి’...
హైటెక్ సిటీ ‘మ్యూజిక్’ సిటీగా మారుతోంది. రాక్..కిర్రాక్ అంటూ మన కుర్రకారు హుషారెత్తిస్తున్నారు. ఇక్కడి డీజేలు, ఆర్జేలు అన్ని వేడుకల్లోనూ అదరగొడుతున్నారు. మ్యూజిక్ టూర్లతో మత్తెక్కిస్తున్నారు. కొత్తగా ‘కరౌకే’ క్రేజ్ మరోవైపు. మొత్తంగా సిటీ యూత్ సంగీతాన్ని ఆదాయంగా,వినోదాత్మకంగా మలచుకుంటున్నారు.
తెరమీద తళుక్కుమనాలి. నిత్యనూతనంగా మెరిసిపోవాలి. నాజూకు లావణ్యంతో ‘నవ’ నవలాడాలి. ఎంతటి ఒత్తిడికైనా తట్టుకోవాలి. ఎక్కడైనా, ఎలాంటి వేదికపై అయినా చెరగని చిరునవ్వుతో కనిపించాలి. సినీ తారల భుజాల మీద ఇన్ని బాధ్యతలు ఉంటాయి. అందుకేనేమో... సినీతారల్లో యోగ సాధన ఒక క్రమం తప్పని అలవాటుగా మారుతోంది. దీంతో నగరంలోని యోగ స్టూడియోలు తారల తళుకులకు నిలయంగా మారుతున్నాయి. శిల్పాశెట్టి నుంచి షెర్టిన్ చోప్రా దాకా.. అమల అక్కినేని నుంచి రాశిఖన్నా దాకా ఏ హీరోయిన్ను చూసినా యోగా రాగమే. అయితే హీరోలతో పోలిస్తే ఈ యోగ సాధన విషయంలో హీరోయిన్లు మరింత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
అందమే ఆరోగ్యం...
గ్లామర్ సంతరించుకోవడానికి, ఉన్న గ్లామర్ కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నించే సినీ స్టార్లు యోగాసనాలను ఆశ్రయిస్తున్నారు. ‘‘జిమ్, వర్కవుట్ కూడా చేస్తా. అయితే వీటన్నింటికన్నా యోగా ఆసనాలు చాలా ప్రధానం. హెల్త్, బ్యూటీకి సంబంధించి అన్ని రకాల సమస్యలకీ ఆసనాల ద్వారా సమాధానం లభిస్తుంది’’అంటారు ప్రముఖ సినీ నటి రాశిఖన్నా. ముఖవర్ఛస్సు మెరుగుపరచేందుకు, చర్మంలో పటుత్వం కాపాడేందుకు, దేహమంతా రక్తప్రసరణకు, తద్వారా శరీరం కాంతి వంతంగా మారేందుకు.... ఇలా విభిన్న అవసరాలకు అనుగుణమైన ఆసనాలు కూడా యోగాలో ఉన్నాయని చెబుతున్నారు.
దేహం దూదిపింజెలా...
సినిమా తారలకు డ్యాన్సుల అవసరం బాగా ఎక్కువనేది తెలిసిందే. ఈ నేపధ్యంలో నృత్యం చేసే సమయంలో శరీరానికి అవసరమైన ఫ్లెక్సిబులిటిని యోగా అందిస్తుందని తారలు అంటున్నారు. ‘‘నిర్ణీత వేడి వాతావరణంలో చేసే హఠయోగా ద్వారా కలిగే లాభాలు అద్భుతం. గంటన్నర పాటు యోగా సాధన చేసిన తర్వాత శరీరం దూదిపింజలా అయిపోతుంది. ఇది డ్యాన్సులు, ఫైట్ల వంటివి మరింత బాగా చేయడానికి అవసరమైన ఫ్లెక్సిబులిటీ కూడా అందిస్తుంది’’అని చెప్పారు సినీ హీరో తరుణ్. ఆసనాలు చేయడానికి ఇంట్లో కూడా అవకాశం ఉన్నప్పటికీ యోగసాధన ప్రియులతో చేయడంలో మరింత ఉల్లాసంగా ఉంటుందన్నారాయన.