muslim 12 percent reservation
-
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌పైనే తొలి సంతకం
కవాడిగూడ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపైనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం పెడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో టీపీసీసీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ సోహైల్ ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే ముస్లింలకు అండగా నిలబడుతోందని.. వారికి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులను కూడా ఇచ్చిందని రేవంత్ చెప్పారు. త్రిపుల్ తలాక్, ఎన్నార్సీ, సీఏఏ వంటి చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని.. కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు పలుకుతోందని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. దళితబంధు పథకం తరహాలోనే ముస్లింలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ముస్లింలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని, నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోనే మైనార్టీల సంక్షేమం అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం పోరాడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ చెప్పారు. ప్రధాని మోదీ మతం పేరుతో లబ్ధి పొందుతున్నారని.. ఆయనకు సీఎం కేసీఆర్ గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు దగాపడ్డారని మండిపడ్డారు. దళితబంధు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు కూడా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్, దాసోజ్ శ్రవణ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్‌ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్‌కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
'కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉంది'
హైదరాబాద్ : ముస్లింల 12 శాతం రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండదన్న నిబంధనలకు లోబడే కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ దుర్బుద్దితో హామీ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే కార్పొరేషన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులకు మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్‌ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.