mussorie
-
Annaatthe Mathew: అన్నేత్తే మాథ్యూ.. ఎవరీమె? వేల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు?
వేసవి వస్తోంది. పరీక్షలు పూర్తయ్యేలోపు ఈ హాలిడేస్కి ఎక్కడికి వెళ్దాం? అనే ప్లాన్ మొదలవుతుంటుంది. అసలే రెండేళ్లుగా ఇంట్లోనే గడిచిపోయిన జీవితాలు ఇప్పుడు రెక్కలు విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే టూర్ ప్లాన్ వేయడం సులభమే, కానీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కల సంరక్షణ ఎలా? మొక్కల ప్రేమికుల మనసును కలచి వేసే ఆవేదన ఇది. ఇందుకోసం ‘గ్రీక్స్ ఆఫ్ గ్రీన్’ యూ ట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న అన్నేత్తే మాథ్యూ సూచనలను అనుసరిద్దాం. ఇంతకీ అన్నేత్తే మాథ్యూ ఎవరు? ఆ వివరాలూ తెలుసుకుందాం. ఊరెళ్లే రోజు మొక్కలన్నింటికీ సమృద్ధిగా నీరు పోయాలి. కుండీలకు నేరుగా ఎండ తగిలితే మట్టి త్వరగా ఎండిపోతుంది. కాబట్టి కుండీలను నీడలో ఉంచాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీటిని నింపి మూతకు సన్నని సూదితో రెండు రంధ్రాలు చేసి బాటిల్‌ని తిరగేసి చెట్టు మొదట్లో అమర్చాలి. లలా చేయడం వల్ల మొక్క పాదుకు కొద్ది కొద్దిగా నీరు అందుతూ ఉంటుంది. ఇంట్లో వెడల్పు తొట్టె ఉంటే ఆ తొట్టెలో నీటిని నింపి ఆ నీటిలో మొక్కల కుండీలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుండీల్లో ఉన్న తేమ ఎక్కువ కాలం నిలుస్తుంది. పెద్ద తొట్టె లేనప్పుడు కుండీలను ఉంచగలిగిన సైజ్ ప్లాస్టిక్ టబ్‌లు తెచ్చి అందులో నీటిని నింపి మొక్కల కుండీలను ఉంచవచ్చు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దోమల బెడద ఎదురవుతుంది. ఈ సమస్యను నివారించడానికి టబ్‌లోని నీటిలో మూడు చుక్కల హైడ్రోజెన్ పెరాక్సైడ్, మూడు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. ఇవన్నీ సాధ్యం కాకపోతే మరో సులువైన చిట్కా ఉంది. ఒక పాత్రలో నీటిని పోసి నూలు వస్త్రాన్ని తాడులా చేసి ఒక చివరను నీటి పాత్రలో, మరొక చివరను మొక్క మొదట్లో ఉండేటట్లు అమర్చాలి. నీటి పాత్ర నుంచి మొక్క పాదులోకి నూలు వస్త్రం తాడు సాయంతో తేమ అందుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకే పాత్రలో ఎక్కువ నూలు తాళ్లను ఉంచి రెండో చివర్లను ఒక్కో పాదులో అమర్చడం ద్వారా ఎక్కువ మొక్కలకు నీటిని సరఫరా చేయవచ్చు. ఎనిమిదేళ్ల శ్రమకు దర్పణం మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో మూడు వందల రకాల మొక్కలను పెంచుతోంది. ‘‘ముస్సోరీలోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి మొక్కలను చూస్తే ముచ్చటేసింది. వచ్చేటప్పుడు నాతోపాటు నలభై మొలకలను వెంట తెచ్చుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మొక్కలే లోకం గా మారిపోయింది. మొక్కలు చిగుళ్లు తొడగడం నుంచి మొగ్గ తొడగడం పువ్వు పూయడం ప్రతిదీ స్మార్ట్ ఫోన్లో రికార్డు చేసేదాన్ని. ఈ మొక్క ఫలానా, ఈ పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది... వంటి వివరాలన్నీ ఎవరో ఒకరితో చెప్పాలనిపించేది. దాంతో నాలుగేళ్ల కిందట యూట్యూబ్ చానెల్ ప్రారంభించి నా మొక్కల వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టాను. దాదాపుగా ఎనిమిది నెలల వరకు నా చానెల్ గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత వ్యూయర్షిప్ చాలా వేగంగా పెరిగిపోయింది. మొక్కల పెంపకంలో నేను అనుసరిస్తున్న మెళకువలు, పరిరక్షణ పద్ధతులను కూడా వీక్షకులతో పంచుకుంటూ ఉండడంతో, అవన్నీ వారికి ఉపయుక్తంగా ఉంటున్నాయని మా వీక్షకుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. చాలా మంది మొక్కలను పెంచడం ఇష్టంగానే ఉంటోంది కానీ, ఓ వారం రోజులపాటు ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతోంది. తిరిగి వచ్చేటప్పటికి వాడిపోతాయనే భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాం అంటుంటారు. వాళ్ల కోసం ఈ చిట్కాలు’’ అంటారు అన్నేత్తే మాథ్యూ. ఆమె చానెల్‌కి ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఎనిమిదేళ్లపాటు మొక్కలే లోకంగా జీవించిన మాథ్యూ సాధించిన పచ్చటి ప్రగతి ఇది. -
కొండల రాణి.. మేఘాల్లో తేలినట్లుగా ఉంటుంది!
మనకు పర్వత రాజు తెలుసు... ఈ కొండల రాణి ఎవరు? మన రాజరికం రాజు ప్రధానం... బ్రిటిష్ రాజరికం రాణి ప్రధానం. అందుకే... బ్రిటిషర్లు గుర్తించిన ఈ హిల్‌స్టేషన్ ‘క్వీన్ ఆఫ్ ద హిల్స్’ అని... సగౌరవంగా నామకరణం చేసుకుంది. ఆ మకుటానికి వన్నె తరగనివ్వని పర్యాటక ప్రదేశం ముస్సోరీ. ఈ ప్రదేశంలో మన్సూర్ అనే చెట్ల గుబుర్లు ఎక్కువ. దాంతో మన్సూర్ అనే పేరే వాడుకలో ఉండేది. బ్రిటిష్ అధికారుల ఉచ్చారణలో ముసూరీ అయింది. వాళ్లు నిర్దేశించిన ఇంగ్లిష్ స్పెల్లింగ్‌తో మన ఉచ్చారణలో ముస్సోరీగా స్థిరపడింది. ముస్సోరీ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లాలో ఉంది. ఢిల్లీ నుంచి ముస్సోరీకి రోడ్డు మార్గం మూడు వందల కిలోమీటర్ల లోపే, కానీ ప్రయాణం ఆరు గంటలు పడుతుంది. అయితే ఈ ప్రయాణంలో టైమ్ వృథా అయిందని ఏ మాత్రం అనిపించదు. ఢిల్లీ దాటిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నంత సేపు రోడ్డు మీది దుమ్ముతో పోటీ పడి పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి సీన్ మారిపోతుంది. ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం ఆహ్వానం పలుకుతుంది. పర్వతాల మీదకు సాగుతున్న ప్రయాణం నేల నుంచి నింగికి వేసిన నిచ్చెన మీద ఎక్కుతున్నట్లు ఉంటుంది. పైపైకి వెళ్లే కొద్దీ మేఘాలు మన దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తుంది. వాహనాన్ని సురక్షితమైన ఒక మలుపులో ఆపి రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తే మేఘాలు ఏ మాత్రం నిరుత్సాహ పరచకుండా మెల్లగా వచ్చి మెత్తగా చెంపలను తాకుతాయి. ఆ చల్లదనాన్ని ఆస్వాదించేలోపే ముందుకు వెళ్లిపోతాయి. భవనాల దగ్గరకొచ్చే సరికి మేఘాలు చెదిరి పోయి దూదిపింజల్లా మారిపోతాయి. కొన్ని మబ్బు తునకలు భవనాలకు తగులుకున్న గాలిపటంలాగ కొద్దిసేపు అలాగే ఉండిపోతాయి. అంతలోనే మబ్బు కరిగి జల్లుగా మారుతుంది. పది నిమిషాల్లోనే ఆకాశం నిర్మలంగా మారిపోతుంది. లోయ నుంచి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు పెరిగిన దేవదారు, పైన్, ఓక్ వృక్షాలు కూడా పర్యాటకుల చూపుని క్షణకాలం పాటు తమ మీద నిలుపుకుంటాయి. ముస్సోరీ పట్టణాన్ని చేరేలోపు పర్వతాల మధ్య విస్తరించిన ఒక పెద్ద సరస్సు ఉంది, దానికి విడిగా పేరేమీ లేదు, ముస్సోరీ లేక్ అంటారు. ముస్సోరీలో సూర్యోదయం ముస్సోరీ పట్టణం ఆరువేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ సూర్యుడు మరీ పొద్దున్నే ఉదయిస్తాడు. కాంతులు చిమ్ముతూ ఆకారంలో కూడా పెద్దగా, తెల్లగా కనిపిస్తాడు. కిరణాలు వేడి ఉండవు కానీ కొండల మీద తీక్షణంగా కాంతిపుంజంలాగ ప్రతిఫలిస్తూ ఉంటాయి. ముస్సోరీ పట్టణం కొండల మీద మైదాన ప్రదేశం కాదు. కొండల బారుల మీద, వాలులోనూ విస్తరించిన పట్టణం. పౌర్ణమి రోజుల్లో టూర్ ప్లాన్ చేసుకుంటే సాయంత్రం పూట ఇక్కడ ప్రధాన రహదారిలో లైబ్రరీ పాయింట్, మాల్ రోడ్ వరకు నడిచి తీరాలి. మాల్ రోడ్ నుంచి గన్ హిల్ మీదకు రోప్ వే క్యాబిన్లో వెళ్లాలి. పగలయితే పచ్చదనం నిండిన పర్వత శ్రేణులు అలరిస్తాయి. రాత్రి లైట్లు మిణుకు మిణుకుమంటూ పట్టణం ఎంత మేర విస్తరించిందో తెలియచేస్తుంటాయి. గన్ హిల్ మీద కొంత ప్రదేశం చదునుగా ఉంటుంది. ఈ హిల్ మీద నుంచి చూస్తే మంచు దుప్పటి కప్పుకున్న ప్రధాన హిమాలయాలు కనిపిస్తాయని చెబుతారు. కానీ చాలా అరుదుగా ఆకాశంలో మబ్బుల్లేనప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఈ గన్‌హిల్ మీద ఫొటోగ్రఫీ స్టూడియోలలో ఉత్తరాఖండ్, కశ్మీరీ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ఉంటాయి. మొత్తం ప్యాకేజ్ రెండు వందలు ఉంటుంది. ఈ దుస్తులను ఎంతమంది ధరించారో అని పర్యాటకులు డైలమాలో ఉండగానే స్టూడియో వాళ్లు ఆ దుస్తుల్ని తగిలించేసి ఫొటోకి పోజిమ్మని హడావుడి చేస్తారు. ఇక్కడ తీసుకున్న ఫొటో ముస్సోరీ టూర్ జ్ఞాపకానికి అందమైన భౌతిక రూపంగా ఆల్బమ్‌లో కలకాలం ఉండి తీరుతుంది. -వాకా మంజులారెడ్డి ట్రావెల్ టిప్స్.. జాగ్రత్తగా వెళ్లి వద్దాం! ముస్సోరీలో పర్యటించడానికి మార్చి నుంచి జూన్ వరకు వాతావరణం అనుకూలిస్తుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో కూడా వెళ్ల వచ్చు. కానీ ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, క్యాంపింగ్ వంటి సరదాలకు వేసవి కాలమే సౌకర్యం. సన్‌గ్లాసెస్, అత్యవసర మందులు, ఎగుడుదిగుడు ప్రదేశాల్లో నడవడానికి అనువైన స్పోర్ట్స్ షూస్ తీసుకెళ్లాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టం 30 డిగ్రీలకు మించవు, కనిష్టం పది డిగ్రీలకు తగ్గిపోతాయి. కాబట్టి వేసవిలో కూడా ఊలు దుస్తులు తీసుకెళ్లాలి. ఇక్కడ రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుంది. కాబట్టి గొడుగు, రెయిన్ కోట్ కూడా ఉంటే మంచిది. ఫొటోగ్రఫీని ఇష్టపడే వాళ్లు లెన్స్ కెమెరా తీసుకెళ్తే అందమైన టూర్ జ్ఞాపకాలతోపాటు మంచి ఫొటోలను కూడా వెంట తెచ్చుకోవచ్చు. భోజనానికి టిబెటన్, ఇండియన్, కాంటినెంటల్ క్విజిన్లు ఉంటాయి. హ్యాండ్ టోస్టెడ్ పిజ్జాతోపాటు చక్కటి పంజాబీ శాకాహార వంటకాలు ఉంటాయి. మాంసాహారం కూడా దొరుకుతుంది. కానీ కొత్త ప్రదేశాల్లో తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యి త్వరగా శక్తినిచ్చేదిగా ఉంటే టూర్ హాయిగా సాగుతుంది. -
ఐఏఎస్ అకాడమీలో కాల్పులు
ముస్సోరి: ముస్సోరిలోని ప్రముఖ ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రం 'లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఐఏఎస్ ట్రైనీస్' వద్ద ఓ జవాను కాల్పులు జరపడంతో అతడి సహచరుడు చనిపోయాడు. మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం అతడు పారిపోయాడు. కాల్పులు జరిపిన సైనికుడు ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు విభాగానికి చెందినవాడు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పారిపోయిన జవానుకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. -
నేను లీడర్‌ను మాత్రమే..
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. నా విజయం వెనుక ఐఏఎస్‌ల పాత్ర ఎంతో ఉంది. నేను లీడర్‌ను మాత్రమే. నేనిచ్చే ఆదేశాలను అమలు చేయడం, పర్యవేక్షించడం అంతా ఐఏఎస్‌లు చేశారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి అకాడమీ ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం ‘గ్లోబలైజ్ వరల్డ్’ అంశంపై చంద్రబాబు మాట్లాడారు. బహిరంగసభల్లో ప్రసంగాలు చేసే తనకు శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల ముందు మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు చేశానన్నారు. సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి తామిచ్చిన విధానపరమైన నిర్ణయాలను అధికారులు అమలు చేయడం వల్లనే ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ ఆర్థికలోటును ఎదుర్కొంటోందని, సహజ వనరుల సాయంతో ఏపీని అభివృద్ధి చేస్తానని చెప్పారు. తమ రాష్ట్ర అభివృద్ధికి సూచనలు, సలహాలిస్తే అమలు చేస్తామని చెప్పారు. మరిన్ని నిధులు తెండి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, నీటిపారుదల, రోడ్ల అభివృద్ధి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఏపీభవన్ గురజాడ సమావేశ మందిరంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడు తోట నర్సింహం, పార్టీ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీలు కంభంపాటి, గోకరాజు గంగరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత పాల్గొన్నారు. కాగా, ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎంపీలు ఎవరూ ఉండరాదని చంద్రబాబు ఆదేశించారు. ఎంపీలుగా ఉన్న వారు కేంద్రంనుంచి నిధులు రాబట్టే పనుల్లో శ్రద్ధ చూపాలని, ఇలాంటి పదవుల్లో ఉండడం తగదని సూచించారు. చంద్రబాబు ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌లతో దాదాపు అరగంట సమావేశమయ్యారు. పార్టీ పరువు బజారున పడిందని మండిపడ్డారు. ఇద్దరూ కాకుండా వేరొకరికి ఛాన్స్ ఇద్దామని సూచించారు.