పాక్ సైన్యం పైశాచికం.. చంపాక ముక్కలుగా నరికారు!
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో నలుగురు భారత సైన్య సిబ్బందిని పాక్ సైన్యం బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిని చంపాక చేసిన పైశాచిక చేష్టల గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బయటపడ్డ మరో జవాన్ అందించిన వివరాల ప్రకారం వర్ణించలేని రీతిలో వారిని పాక్ ఆర్మీ హింసించిందంట.
నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టరు వద్ద నలుగురు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతలో ఊహించని రీతిలో పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) వారివైపు దూసుకొచ్చింది. వారి వెంట కొందరు ఉగ్రవాదులు కూడా ఉన్నారంట. సుమారు 400 మీటర్ల సరిహద్దు దాటేసిన పాక్ సైన్యం వారిని బంధీలుగా చేసుకుంది. ఆపై చిత్ర హింసలకు గురి చేసి హతమార్చింది. ఇక వారిని చంపాక దాష్టీకానికి పాల్పడింది. వారి మృతదేహాలను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది.
సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లే లక్ష్యంగా వీరు వచ్చారని భారత సైన్యం ప్రకటించింది. మేజర్ మోహకార్ ప్రఫుల్లా అంబాదాస్ (32), లాన్స్ నాయక్ గుర్మెయిల్ సింగ్ (34), లాన్స్ నాయక్ కులదీప్ సింగ్ (30), సిపాయి పర్ గత్ సింగ్ (30)లు పాక్ టీమ్ దుర్మార్గానికి బలయ్యారు. మరో జవాను తీవ్ర గాయాలతో తప్పించుకోగా, అతనికి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన తరువాత పాక్ సైనిక పోస్టులపై భారత్ భారీ ఎత్తున ప్రతిదాడులకు దిగింది.
అంబదాస్ మహారాష్ట్రలోని భందారాకు చెందినవారు కాగా.. గుర్మైల్ కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, పర్గత్ కుటుంబం హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఉంటోంది. ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం మెహబూబా ముఫ్తీ రాజౌరీ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పాక్ కాల్పులు జరపడం గమనార్హం.
నా వార్త నిజం కాదు.. ఆర్మీ ప్రకటన...
‘మేజర్ అంబదాస్, లాన్స్‌నాయక్ గుర్మైల్, సిపాయ్ పర్గత్‌లు అసమాన ధైర్యం, నిజాయితీలున్న సైనికులు. విధి నిర్వహణలో వారి అంకితభావానికి, ప్రాణత్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వారిని ముక్కలుగా నరికారన్న జవాన్ ప్రకటనను ఆర్మీ ఖండించింది. శరీరంపై బుల్లెట్ల గాయాలు మాత్రమే ఉన్నాయని.. నరికారన్న వార్తలో వాస్తవం లేదని అధికారులు చెబుతుండటం విశేషం.