ముత్తారం జెడ్పీటీసీ రాజీనామా
మంథనిని జిల్లాగా ప్రకటించాలని..
మంథని : మంథని రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించకపోవడం, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయాన్ని పెద్దపల్లికి తరలించడాన్ని నిరసిస్తూ ముత్తారం జెడ్పీటీసీ సభ్యుడు చొప్పరి సదానందం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య నిర్వాహణాధికారి బుధవారం మెయిల్ ద్వారా పంపారు. ముఖ్యమంత్రికి సైతం తన రాజీనామాకు గల కారణాలు, మంథని జిల్లా ఏర్పాటుకు ఉన్న ప్రత్యేకతో కూడిన లేఖను పంపిస్తానని తెలిపారు. మంథనిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాల క్రితమే మంథని కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని డిమాండ్ వచ్చిందన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, మేధావులు ప్రజల ఆకాంక్షను తెలియజేశారని గుర్తుచేశారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు మంథనికి ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 31 జిల్లాలకు అనుకూలంగా ఉండి అందులో మంథనికి చోటుకల్పించకపోవడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. ఆయన వెంట డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆజీంఖాన్, నాయకులు ఉన్నారు.