muttu
-
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
కూతురి కోసం స్త్రీ జన్మను వీడి మగ బతుకులో
స్టేజ్ మీద నాటకం కోసం కాసేపు స్త్రీ పురుషుడిగా... పురుషుడు స్త్రీగా మారాలంటేనే కొంచెం కష్టం. కాని– తమిళనాడులో ఒక తల్లి 30 ఏళ్లుగా పురుష అవతారం ఎత్తి జీవిస్తోంది. భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవడం కోసం ఆమె పురుషుడిగా మారింది. ‘ముత్తు మాస్టర్’గా టీ స్టాల్లో పని చేసే ఆమె స్త్రీ అని ఎవరికీ తెలియదు. పురుషాధిపత్య సమాజం ఎంత భయపెడితే ఆమె ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది? రాజ్యాలను కాపాడుకోవడానికి ఆడపిల్ల పుడితే మగపిల్లాడిగా పెంచిన ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. ఒంటరి స్త్రీలు ఈ మగ ప్రపంచంలో బతకాలంటే అవసరార్థం మగ అవతారం ఎత్తక తప్పదని రాజ్ కపూర్ ‘మేరా నామ్ జోకర్’లో పద్మిని పాత్ర ద్వారా చూపిస్తాడు. ఆమె ఆ సినిమాలో మగవాడి వేషం కట్టి బతుకు ఈడుస్తుంటుంది. అమోల్ పాలేకర్ తీసిన ‘దాయ్రా’ అనే సినిమాలో ఒక గ్రామీణ యువతి గ్రామస్తుల దాష్టికాలు భరించలేక, స్త్రీగా తనకు కలుగుతున్న అభద్రత నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మగ ఐడెంటిటీలోకి మారిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఒక నిస్సహాయురాలైన వితంతువు తన కూతురిని పెంచుకోవాలంటే మగవాడి అవతారం ఎత్తక తప్పదని భావించి గత ముప్పై ఏళ్లుగా అలాగే బతుకుతున్నదని తెలిస్తే ఆశ్చర్యమూ బాధా కలుగుతాయి. ఆ స్త్రీ పేరు పెచ్చియమ్మాళ్. ఊరు తమిళనాడులోని తూతుకూడి జిల్లాలోని కతునాయకన్పట్టి. 20 ఏళ్ల వయసులో పెచ్చియమ్మాళ్ది తూతుకూడి జిల్లా. ఆమెకు వివాహం అయ్యాక గర్భంలో ఉండగా భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఒంటరి స్త్రీగా కుమార్తెను కాపాడుకోవడానికి అదే జిల్లాలోని రెండు మూడు ఊళ్లలో ప్రయత్నించింది పెచ్చియమ్మాళ్. ఒంటరి స్త్రీ. పైగా వయసులో ఉంది. నిస్సహాయురాలు. అలాంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాలో అన్నీ ఎదుర్కొంది ఆమె. తన ప్రాణం, తన ఉనికి కంటే తన కుమార్తె ఉనికి ముఖ్యం అనుకుందామె. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలి... తను కూడా రేపు పెద్దది అవుతుంది... దానికి కూడా ఒక మగ అండ ఉందనే భ్రాంతి కలిగించాలి అనే ఆలోచన ఆమెకు కలిగింది. మగ అవతారం ఎత్తడమే అందుకు విరుగుడు అనుకుంది. అంతే! జుట్టు కత్తిరించుకుని, లుంగీ చొక్కా ధరించి, పూర్తిగా పురుషుడిలా కనిపిస్తూ ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్పట్టికి చేరుకుంది. అన్ని మగవాళ్ల పనులే ఆ పల్లెలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. ఆమె తన పేరును ముత్తు అని చెప్పుకుంది. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలి పనులు, పెయింటింగ్ పని, కొబ్బరి బోండాలు కొట్టే పని, ఎక్కువ కాలం ఆమె హోటల్లో పరోటా మాస్టర్‌గా, టీ మాస్టర్‌గా పని చేసింది. అందువల్ల ఆమెను ఆ ఊళ్లో అందరూ ‘ముత్తు మాస్టర్’ అని పిలుస్తారు. ముత్తు మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురిని పెంచి పెద్ద చేసుకుంది. ఆమెకు జీవితం ఇచ్చింది. ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని భావించేవారు. కూతురికి ‘తండ్రి అండ’ ఉండటం వల్ల ప్రత్యేకంగా సమస్యలు రాలేదు. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు 30 ఏళ్లుగా మగవాడిగా బతుకుతున్నది పెచ్చియమ్మాళ్. ఇప్పుడు ఆమె వయసు 57 సంవత్సరాలు. పెన్షన్ కోసం అసలు రూపం పెచ్చియమ్మాళ్‌కు వయసు మీద పడింది. మునుపటిలా కష్టపడలేకున్నది. తన బతుకు, కూతురి బతుకు కూడా అంతంత మాత్రమే. అందుకని ‘వితంతువు పెన్షన్’ కోసం ఇక అసలు అవతారాన్ని బయటపెట్టింది. తాను స్త్రీనని చెప్తే ఊరంతా ఆశ్చర్య పోయింది. నమ్మకమైన ఇద్దరు ముగ్గురు స్త్రీలకు తప్ప ఇప్పటి వరకూ ఆ సంగతి ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాళ్ ఆధార్ కార్డు ‘ముత్తు’ పేరుతోనే ఉంది. ఆమె దగ్గర భర్త డెత్ సర్టిఫికెట్ లేదు. అందువల్ల ఆమెకు వితంతు పెన్షన్ ఇవ్వడం సమస్యగా మారింది. ఈ విషయం అందరికీ తెలిసి తనకు సహాయం అందడం కోసం ఈ విషయాన్ని మీడియాకు బయటపెట్టింది. అయితే తాను ఇలా ఇక మీదట కూడా పురుషుడిగానే ఉంటానని. తాను చనిపోయాక ముత్తుగానే అందరూ గుర్తు చేసుకోవాలని ఆమె కోరింది. -
గులాబీ.. లాభాల జిలేబీ!
మండలంలోని హైతాబాద్, మద్దూరు, సోలిపేట్, సర్దార్‌నగర్, పెద్దవేడు, రేగడిదోస్వాడ, అప్పరెడ్డిగూడ, మల్లారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు పూల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. గులాబీ రకాలైన రుబీ, టైగర్, సెంట్, ముత్తు తదితర రకాలతోపాటు ఫైవ్‌స్టార్ రకం గులాబీని అధికంగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల రైతులు తక్కువ పెట్టుబడితో.. అధికారుల సూచనలు పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గులాబీ తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం రాయితీలను సైతం అందిస్తోంది. బెంగళూర్‌లోని హొసూరు పట్టణంలోని నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.15 నుంచి రూ.20 వరకు లభిస్తుంది. వీటిని తెచ్చి రైతులు పూల సాగు చేస్తున్నారు. అందుబాటులో మార్కెట్ సదుపాయం హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రైతులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కిలో పూలు రూ.50 ధర పలుకుతున్నాయి. వేసవిలో, పెళ్లిళ్లు, పూజలు, పండగలు తదితర సీజన్లలో రూ.150 నుంచి 200 వరకు కిలో పూలు విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూయడంతో ధర హెచ్చు తగ్గులైనా ఎకరానికి ఖర్చులు పోను రూ.50 వేలకుపైనే లాభాలు వచ్చే అవకాశం ఉంది. సాగు ఇలా.. అన్ని పంటల మాదిరిగానే గులాబీ పంటకు కూడా దుక్కి కలియ దున్నాలి. మొక్కల మధ్య మూడు అడుగులు, సాగుకు మధ్య ఆరు అడుగులు ఉండేలా రెండు అడుగుల లోతు గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసిన మట్టిలో సేంద్రియ ఎరువు, గుళికలు, ట్రైకోడర్మవిరిడితో కలిపి సగం వరకు పూడ్చాలి. మొక్కలకున్న పాలిథిన్ కవర్లు తీసివేసి నాటాలి. మామిడి, జామ తదితర పండ్ల తోటల్లోనూ అంతర పంటలుగా గులాబీ సాగుచేయవచ్చు. ఎకరానికి 2500 నుంచి 3 వేల మొక్కలు నాటవచ్చు. నెలరోజుల అనంతరం మొగ్గలు వచ్చే సమయంలో రసాయనిక ఎరువులు డీఏపీ, క్యాల్షియం పొటాష్ కూడా వేయాలి. నెలరోజుల నుంచి మొగ్గలు తొడిగి పూలు పూస్తూనే ఉంటాయి. చీడపీడల బెడద పెద్దగా ఉండదు. మచ్చతెగులు, పచ్చ పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్ మందును లీటర్ నీటికి 30 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు పెరిగేంతవరకు తోట సేద్యం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చేస్తూనే ఉండాలి. పూలు పూయడం ప్రారంభమయ్యాక రోజు విడిచి రోజు పూలను తెంపుకోవచ్చు.