మ్యాన్‌ఫ్యాక్చర్డ్ బై ఖైదీలు
పోచమ్మమైదాన్ : ఖైదీలు.. ఈ పేరు వినగానే వారి చేసిన నేరాలు, ఘోరాలే గుర్తుకొస్తాయి. కానీ వరంగల్‌లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు బయటకు వెళ్లాక ఉపాధి పొం దేలా పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, సత్ప్రవర్తనతో మెలుగుతున్న పలువురు ఖైదీలతో ఓపెన్ ఎయిర్ జైలు పేరిట వ్యవసాయం, పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇదేకాకుండా ఖైదీలకు చేనేత, వడ్రంగి, వెల్డింగ్, బుక్ బైండింగ్, ఫినాయిల్, అగర్బత్తీలు, సబ్బుల తయారీ తదితర పనులు నేర్పిస్తూ వస్తువులు తయారుచేయిస్తున్నారు. ఈ మేరకు ఖైదీలు తయారుచేసిన వస్తువుల అమ్మకం, ప్రదర్శనను శనివారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని పద్మశ్రీ నేరేళ్ల వేణుమాదవ్ కళాప్రాంగణంలో ‘మై నేషన్’ ఆధ్వర్యాన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలో జంపఖానాలు, టవల్లు, కర్చీప్‌లు, బెడ్ షీట్లు, నోట్బుక్లు, బీరువాలు, ఫినాయిల్, సబ్బులతో పాటు వరంగల్, హైదరాబాద్ జైళ్లలోని ఖైదీలు గీసిన పెయింటింగ్‌లను అమ్మకానికి ఉంచారు. శని, ఆదివారాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను జైలు సూపరింటెండెంట్ న్యూటన్ ప్రారంభించి మాట్లాడారు. వస్తువులను సెంట్రల్ జైలు ఎదుట ప్రత్యేక కౌంటర్లో ప్రతిరోజూ విక్రయిస్తుండగా.. అందరికీ అందుబాబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో జైలర్ నర్సింహస్వామి, జైలు సిబ్బంది పాల్గొన్నారు, కాగా, నగర వాసులు పలువురు ప్రదర్శనలోని వస్తువులు, పెయింటింగ్స్‌ను ఆసక్తిగా పరిశీలించడంతో పాటు కొనుగోలు చేశారు.