పింఛన్ ఇయ్యలేదు..
చిత్రంలో కన్పిస్తున్న వృద్ధులు పింఛన్ కోసం వస్తే వారిపై దయచూపాల్సింది పోయి నిర్దయగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది బయటకు గెంటేశారు. వయసు మీదపడి జీవితాన్ని అష్టకష్టాలపై లాక్కొస్తున్న పండుటాకులపై పింఛన్ పంపిణీ చేసే సిబ్బంది సోమవారం దురుసుగా ప్రవర్తించారు. దీంతో వృద్ధులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ ‘ ఇంక పదిరోజులుంటే మే నెల పూర్తవుతుంది. ఇంతవరకూ పింఛన్ ఇవ్వలేదు. పింఛన్ ఇవ్వండని అడగడానికి వస్తే మా గోడు పట్టించుకునేవారు లేరు.
పైగా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇదెక్కడి న్యాయం ’ అంటూ తీవ్ర ఆవేదన చెందారు. వృద్ధులు ధర్నాకు దిగడంతో మున్సిపల్ అధికారులు పోలీసులను పిలిపించారు. ఏఏ ప్రాంతం వారికి పింఛన్లు పంపిణీ చేస్తామో ఆ వివరాలను కచ్చితంగా తెలియజేస్తామని చెప్పడంతో వృద్ధులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాని కొద్దిరోజుల క్రితం పింఛన్ కోసం వచ్చి వడదెబ్బతగిలి వృద్ధుడు మరణించాడని.. తమకు సరైన సమాచారం ఇవ్వకుండా తిప్పుకుంటే తమకు వడదెబ్బ తగిలితే పరిస్థితి ఏంటని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌లైన్ , మైదుకూరు టౌన్
ఉదయం నుంచి పడిగాపులు
పెనగలూరు, న్యూస్‌లైన్: సగం నెల దాటిపోయినప్పటికీ నేటికీ పింఛన్లు ఇవ్వకపోవడంతో వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం పింఛన్లు ఇస్తామని తెలపడంతో ఉదయం 7గంటల నుంచే వినాయకస్వామి మంటపం వద్ద పడిగాపులు కాయడం మొదలెట్టారు. అనేక మందికి పింఛన్లు రాలేదని తెలపడంతో నిరుత్సాహంతో మండల అభివృద్ధి కార్యాలయానికి చేరుకున్నారు. సిద్దవరం, పెనగలూరు, సింగనమల, సింగారెడ్డిపల్లె పంచాయతీలతో పాటు పలు పంచాయతీలల్లో డబ్బులు రాలేదని సీఆర్పీలు తెలపడంతో వృద్ధులు.. వికలాంగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. డబ్బులు పంపిణీ చేసే అధికారి పరమేశ్వర్‌కు తమ బాధ విన్నవించారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో తిరిగి వేలిముద్రలు, ఫోటోలు తీశారు. రెండు, మూడు నెలలుగా పింఛన్ రాలేదని, తరువాత వస్తుందో, రాదోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధుల ధర్నా
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: పింఛన్ ఇవ్వలేదని సోమవారం మండలంలోని వందలాది మంది స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత రెండు నెలలుగా పింఛన్ ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, దీంతో తీవ్ర నిరాశకు గురయ్యామని తెలిపారు. జ్యోతి కాలనీకి చెందిన లెప్రసీ కాలనీ వారు మాట్లాడుతూ బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయాలంటే తమకు కష్టంగా ఉందని, అసలే మాకు చేతివేళ్లు, కాలు వేళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, బయోమెట్రిక్‌లో ముద్రలు లేవని పింఛన్ ఆపడం ఎంత వరకు సమంజసమని వారు వాపోయారు. ఈ విషయమై ఐసీఐసీఐ మండల కో-ఆర్డినేటర్ సురేష్‌ను వివరణ కోరగా బయోమెట్రిక్ విధానం వల్ల వేలి ముద్రలు సరిగా లేని వారికి గత రెండు నెలలుగా పింఛన్‌రావడం లేదన్నారు. త్వరలో పింఛన్ రాని వారందరి వేలిముద్రలు తీసుకుని జూన్నెలలో అందరికీ అందచేస్తామన్నారు.