Mysore University
-
ఆన్సర్షీట్ల చోరీ కేసు.. పరారీలో సీఐ
సాక్షి, బెంగళూరు: మైసూరు వర్సిటీ ఆన్సర్షీట్ల చోరీ కేసులో మండి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామితో పాటు మరో ఆరు మందిపై క్రిమినల్ కేసు దాఖలైంది. ఇది తెలిసి సీఐ పరారయ్యారు. మైసూరు వర్సిటీ ఉద్యోగి మహమ్మద్ నిసార్, కాంట్రాక్టు ఉద్యోగి రాకేశ్, విద్యార్థులు చందన్, చేతన్, బ్లూ డైమండ్ లాడ్జీ యజమానిపై కేసు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 15, 17న పీజీ కోర్సు రసాయన శాస్త్రం పరీక్ష జరిగింది. ఆ తర్వాత మహమ్మద్ నిసార్, రాకేశ్‌లు కొందరు విద్యార్థుల సమాధాన పత్రాలను ఎత్తుకెళ్లి బ్లూ డైమండ్ లాడ్జీలో ఆ సమాధాన పత్రాలను ఆయా విద్యార్థులకు ఇచ్చి మళ్లీ పరీక్ష రాయించారు. లాడ్జీపై దాడి చేసిన సీఐ నారాయణస్వామి కేసు బయటకు రాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని బేరం పెట్టారు. ఈ తతంగంపై జూన్ 9న సోమసుందర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మైసూరు నగర పోలీసు కమిషనర్ చంద్రగుప్తా విచారణకు ఆదేశించారు. సీఐ పరారు కావడం చర్చనీయాంశమైంది. చదవండి: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్! -
లోఫర్ అంటే తప్పా?
మైసూర్: లోఫర్ (ఓ లక్ష్యం అంటూ లేకుండా గాలికి తిరిగేవాడు) అంటూ మైసూరు యూనివర్శిటీకి చెందిన జర్నలిజం ప్రొఫెసర్ ఎప్పుడో ఏడాది క్రితం రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై దాఖలైన రెండు కేసుల్లో అరెస్టై వారం రోజులపాటు జుడీషియల్ కస్టడీకి వెళ్లిన ప్రొఫెసర్ బీపీ మహేశ్‌చంద్ర గురు... శుక్రవారం నాడు విడుదలయ్యారు. ఆయనకు ఓ కేసులో ఈ జూన్ 18వ తేదీన, రెండో కేసులో జూన్ 24వ తేదీన బెయిల్ మంజూరైంది. కర్ణాటకలోని మైసూర్ యూనివర్శిటీలో 2015, జనవరి నెలలో ‘అంబేడ్కర్-హిందూయిజం’ అనే అంశంపై బహుజన విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన ఓ సదస్సులో మహేశ్‌చంద్ర గురు మాట్లాడుతూ అయోధ్య రాముడిని లోఫర్ అని వ్యాఖ్యానించారట. ఈ వార్తను పత్రికలో చదివిన కరుణాడ రక్షణ వేదిక అనే హిందూ సంస్థకు చెందిన సీవీ రవిశంకర్ అనే వ్యక్తి గతేడాది జనవరి నెలలోనే కేసు నమోదు చేశారు. హిందూ జాగారన్ వేదికకు చెందిన ప్రేమ్‌కుమార్ అనే మరో వ్యక్తి ఫిబ్రవరి నెలలో ప్రొఫెసర్‌పై మరో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల గురించి ఆ ప్రొఫెసర్ పూర్తిగా మరచిపోయారు. ఈ కేసులను విచారించిన మైసూరు కోర్టు జూన్ 18వ తేదీన ప్రొఫెసర్‌ను జుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై స్పందించిన పోలసులు ప్రొఫెసర్‌ను జుడీషియల్ కస్టడీకి పంపించారు. పౌర హక్కుల ప్రజా సంఘానికి చెందిన కర్ణాటక విభాగం ప్రొఫెసర్ తరఫున వాదించడంతో ఆయనకు రెండు కేసుల్లోనూ బెయిల్ లభించింది. ఓ విద్యావేత్తను, ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పౌర హక్కుల సంఘం వాదిస్తోంది. సదస్సుకు హాజరైన వ్యక్తులు కాకుండా ఓ పత్రికలో వచ్చిన వార్తను చూసి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలా స్పందిస్తారని ప్రశ్నిస్తోంది. ఫిర్యాదు చేసిన వారికి లోకల్స్టాండీ కూడా లేదని వాదిస్తోంది. లోఫర్ అనే పదాన్ని నేరపూరితమైన, అవమానకరమైన పదంగా ఎలా పరిగణిస్తారని కూడా ప్రశ్నిస్తోంది. ఓ మతాన్ని, మత విశ్వాసాలను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా ఎవరు ప్రయత్నించకూడదని చెబుతున్న భారతీయ శిక్షాస్మృతిలోని 295(ఏ) సెక్షన్ కింద పోలీసులు ప్రొఫెసర్‌పై కేసులు నమోదు చేశారు. గతంలోకూడా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ‘లోఫర్’ అనే పదంపై వివాదం చెలరేగింది. 1990వ దశకంలో కర్ణాటక రైతు ఉద్యమ నిర్మాత, లీగల్ స్కాలర్ దివంగత ప్రొఫెసర్ నంజుండస్వామి అప్పటి ముఖ్యమంత్రిని ఒక లోఫర్ అని అభివర్ణించారు. కర్ణాటక రాజకీయ వర్గాల్లో దీనిపై గొడవ జరిగింది. క్షమాపణలు చెప్పాలని నంజుండస్వామిని డిమాండ్ చేశారు. అందుకు ఆయన ససేమిరా అంగీకరించలేదు. తాను అన్న లోఫర్ అనే పదం అవమానకరమా, అన్‌పార్లమెంటరీనా తేల్చాలని కూడా ఆయన సభలో డిమాండ్ చేశారు. లోఫర్ అంటే నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా గాలికి తిరిగేవాడని అర్థమని కూడా స్కాలర్‌గా ఆయన వివరించారు. అంతటితో ఆ గొడవ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు లోఫర్‌కు భాష్యం చెప్పాల్సింది మైసూర్ కోర్టు. -
జాతీయ కవి జీఎస్‌ఎస్కన్నుమూత
= శోక సముద్రంలో సాహితీ లోకం =నేడు ప్రభుత్వ సెలవు =గురువారం అంత్యక్రియలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రముఖ సాహితీవేత్త, జాతీయ కవి డాక్టర్ జీఎస్. శివరుద్రప్ప (87) సోమవారం మధ్యాహ్నం ఇక్కడి బనశంకరిలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దీర్ఘ కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పదేళ్ల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. జాతీయ కవి కువెంపు సాహితీ వారసుడుగా కీర్తి గడించిన జీఎస్ఎస్ కన్నుమూతతో సాహిత్య లోకం శోక సముద్రంలో మునిగిపోయింది. కువెంపు తర్వాత గోవింద పాయ్ అనంతరం రాష్ట్ర కవి గౌరవాన్ని దక్కించుకున్న శివరుద్రప్పను సాహితీ ప్రియులు జీఎస్ఎస్ అని పిలుస్తారు. 1926 ఫిబ్రవరి 7న జన్మించిన జీఎస్‌ఎస్‌ను కన్నడ సాహితీ లోకంలో బహుదూరపు బాటసారిగా అభివర్ణిస్తారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో ఉపాధ్యాయుని కుమారునిగా జన్మించిన జీఎస్ఎస్ మైసూరు విశ్వ విద్యాలయంలో ప్రథమ తరగతిలో ఎంఏ పాసవడమే కాకుండా మూడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రముఖుల సంతాపం జీఎస్ఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడతో జేడీఎస్, బీజేపీ నాయకులు జీఎస్ఎస్ అంతిమ దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రెండు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులకు సెలవు ప్రకటించారు. జీఎస్ఎస్ అంత్యక్రియలను కళాగ్రామ లేదా జ్ఞాన భారతిలో నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన బంధువులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున గురువారం అంత్యక్రియలను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సోమవారం రాత్రి ఆయన భౌతిక కాయాన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.