జాతీయ కవి జీఎస్‌ఎస్కన్నుమూత
= శోక సముద్రంలో సాహితీ లోకం
=నేడు ప్రభుత్వ సెలవు
=గురువారం అంత్యక్రియలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రముఖ సాహితీవేత్త, జాతీయ కవి డాక్టర్ జీఎస్. శివరుద్రప్ప (87) సోమవారం మధ్యాహ్నం ఇక్కడి బనశంకరిలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దీర్ఘ కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పదేళ్ల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. జాతీయ కవి కువెంపు సాహితీ వారసుడుగా కీర్తి గడించిన జీఎస్‌ఎస్ కన్నుమూతతో సాహిత్య లోకం శోక సముద్రంలో మునిగిపోయింది.
కువెంపు తర్వాత గోవింద పాయ్ అనంతరం రాష్ట్ర కవి గౌరవాన్ని దక్కించుకున్న శివరుద్రప్పను సాహితీ ప్రియులు జీఎస్‌ఎస్ అని పిలుస్తారు. 1926 ఫిబ్రవరి 7న జన్మించిన జీఎస్‌ఎస్‌ను కన్నడ సాహితీ లోకంలో బహుదూరపు బాటసారిగా అభివర్ణిస్తారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో ఉపాధ్యాయుని కుమారునిగా జన్మించిన జీఎస్‌ఎస్ మైసూరు విశ్వ విద్యాలయంలో ప్రథమ తరగతిలో ఎంఏ పాసవడమే కాకుండా మూడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.
ప్రముఖుల సంతాపం
జీఎస్‌ఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడతో జేడీఎస్, బీజేపీ నాయకులు జీఎస్‌ఎస్ అంతిమ దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రెండు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులకు సెలవు ప్రకటించారు.
జీఎస్‌ఎస్ అంత్యక్రియలను కళాగ్రామ లేదా జ్ఞాన భారతిలో నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన బంధువులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున గురువారం అంత్యక్రియలను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సోమవారం రాత్రి ఆయన భౌతిక కాయాన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.