Myths of the people
-
కరోనా వ్యాక్సినా.. వద్దు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒకవైపు కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొస్తున్నప్పటికీ టీకాపై ప్రజల్లో అపోహలు తొలగడం లేదు. మారుమూల గ్రామాలు, తండాల వాసులు వ్యాక్సిన్ అంటే వామ్మో! అంటున్నారు. టీకా తీసుకునేందుకు జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది న్యాల్కల్ మండలం హుసెల్లి. మిర్జాపూర్ పీహెచ్సీ పరిధిలోని ఈ గ్రామం లోనూ టీకా వేయించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణాలు పోతే.. మీరు బాధ్యత వహిస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నించడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు పలుమార్లు వెనుదిరిగారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అతికష్టం మీద నలుగురైదుగురికి వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. ఆ ఘటనల తర్వాత.. కొంతకాలం కిందట కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజులకు అతను చనిపోవడంతో టీకా వేసుకోవడంతోనే మరణించి ఉంటాడనే వదంతులు వ్యాపించాయి. అలాగే కంగ్టి మండల కేంద్రంలో మరో 65 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్ వేసుకున్న వారం రోజులకు మృతి చెందాడు. ఈ మరణానికి కూడా వ్యాక్సినే కారణమనే అపోహతో కంగ్టి పీహెచ్సీ వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఒక్కరు కూడా వెళ్లడంలేదు. ఇదంతా అపోహ అని, వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని వైద్యాధికారులు చెపుతున్నప్పటికీ మండలవాసులు ముందుకు రాలేదు. దీంతో అధికారులు ఇక్కడ వ్యాక్సిన్ కేంద్రాన్ని కొంతకాలం మూసిఉంచారు. ఇది సంగారెడ్డి జిల్లా కంగ్టి పీహెచ్సీ. దీని పరిధిలో 33 గ్రామాలు, నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. కోవిడ్ టీకా తీసుకునేందుకు ఈ గ్రామాలవారెవరూ ముందుకు రావడంలేదు. మే, జూన్.. ఈ రెండు నెలలు కంగ్టి మండలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నే రద్దు చేశారు. పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ 4 శాతం లోపే.. జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారు సుమారు 14 లక్షల మంది ఉంటారు. ఇందులో 65 సంవత్సరాలకు మించి వయసున్న వారు సుమారు 3.50 లక్షలు కాగా, 18 సంవత్సరాలు నిండిన వారు 10 లక్షల వరకు ఉంటారని వైద్యారోగ్యశాఖ అంచనా. ఇప్పటి వరకు పూర్తి స్థాయి (రెండు డోసులు) వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 57,748 మాత్రమే అని చెబుతున్నారు. కేవలం నాలుగు శాతం మందికే జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 3.01 లక్షలుగా ఉంది. మొత్తంగా 3.59 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని ఆశాఖ గణాంకాలు చెబుతున్నాయి. -
రక్తదానంపై అపోహలు తొలగాలి
మంచిర్యాల రూరల్ : రక్తదానంపై ఇంకా ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించి ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకొచ్చేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ కోరారు. పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్‌హాలులో లయన్స్ క్లబ్ మంచిర్యాల, గర్మిళ్ల హైటెక్‌సిటీ శాఖల సౌజన్యంతో లయన్స్ క్లబ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ వి.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రక్తం అవసరం రోజురోజుకు పెరుగుతోందని, బ్లడ్ బ్యాంకుల్లో సరిపడా రక్తం నిల్వ ఉండడం లేదని తెలిపారు. ఇందుకోసం ప్రతి చోట రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. రక్తదానంపై యువతీ,యువకులు వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. రక్తదానం చేయకూడదనే మూఢనమ్మకాలను పారద్రోలాలని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో రక్తశుద్ధి యంత్రాలు ప్రారంభించామని, త్వరలో నిర్మల్‌కూ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రక్తశుద్ధి యంత్రాలను మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసినవారికి కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, గుడిపేట 13వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎం.శ్రీనివాస్‌కుమార్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్పర్సన్ ఆర్.నారాయణ రెడ్డి, ఐఆర్సీఎస్ సెక్రటరీ డాక్టర్ అరవింద్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అధ్యక్షుడు కిశోర్‌కుమార్, లయన్స్ జోన్ చైర్పర్సన్ ఏ.రాజేశ్వర్‌రావు, మంచిర్యాల, గర్మిళ్ల, హైటెక్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు చెట్ల జనార్దన్, సీహెచ్.నరేందర్‌రెడ్డి, సీహెచ్.హన్మంతరావు, కె.శ్రీధర్‌బాబు, యు.చంద్రమోహన్, పి.పోచమల్లు, కోశాధికారులు వి.వీరస్వామి, ఏ.రాజమౌళి, బి.రాజలింగు పాల్గొన్నారు.