కరోనా వ్యాక్సినా.. వద్దు! | Myths And Facts About COVID-19 Vaccines | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సినా.. వద్దు!

Published Sun, Jul 25 2021 4:09 AM | Last Updated on Sun, Jul 25 2021 1:48 PM

Myths And Facts About COVID-19 Vaccines - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒకవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తున్నప్పటికీ టీకాపై ప్రజల్లో అపోహలు తొలగడం లేదు. మారుమూల గ్రామాలు, తండాల వాసులు వ్యాక్సిన్‌ అంటే వామ్మో! అంటున్నారు. టీకా తీసుకునేందుకు జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది న్యాల్‌కల్‌ మండలం హుసెల్లి. మిర్జాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని ఈ గ్రామం లోనూ టీకా వేయించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్‌ వేసుకుంటే ప్రాణాలు పోతే.. మీరు బాధ్యత వహిస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నించడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు పలుమార్లు వెనుదిరిగారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అతికష్టం మీద నలుగురైదుగురికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగారు. 

ఆ ఘటనల తర్వాత..
కొంతకాలం కిందట కంగ్టి మండలం రాసోల్‌ గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు రోజులకు అతను చనిపోవడంతో టీకా వేసుకోవడంతోనే మరణించి ఉంటాడనే వదంతులు వ్యాపించాయి. అలాగే కంగ్టి మండల కేంద్రంలో మరో 65 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్‌ వేసుకున్న వారం రోజులకు మృతి చెందాడు. ఈ మరణానికి కూడా వ్యాక్సినే కారణమనే అపోహతో కంగ్టి పీహెచ్‌సీ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు ఒక్కరు కూడా వెళ్లడంలేదు. ఇదంతా అపోహ అని, వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమని వైద్యాధికారులు చెపుతున్నప్పటికీ మండలవాసులు ముందుకు రాలేదు. దీంతో అధికారులు ఇక్కడ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని కొంతకాలం మూసిఉంచారు.

ఇది సంగారెడ్డి జిల్లా కంగ్టి పీహెచ్‌సీ. దీని పరిధిలో 33 గ్రామాలు, నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. కోవిడ్‌ టీకా తీసుకునేందుకు ఈ గ్రామాలవారెవరూ ముందుకు రావడంలేదు. మే, జూన్‌.. ఈ రెండు నెలలు కంగ్టి మండలంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్నే రద్దు చేశారు.   

పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ 4 శాతం లోపే..
జిల్లాలో వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన వారు సుమారు 14 లక్షల మంది ఉంటారు. ఇందులో 65 సంవత్సరాలకు మించి వయసున్న వారు సుమారు 3.50 లక్షలు కాగా, 18 సంవత్సరాలు నిండిన వారు 10 లక్షల వరకు ఉంటారని వైద్యారోగ్యశాఖ అంచనా. ఇప్పటి వరకు పూర్తి స్థాయి (రెండు డోసులు) వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య 57,748 మాత్రమే అని చెబుతున్నారు. కేవలం నాలుగు శాతం మందికే జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరిగినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 3.01 లక్షలుగా ఉంది. మొత్తంగా 3.59 లక్షల డోసుల వ్యాక్సినేషన్‌ జరిగిందని ఆశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement