మంచిర్యాల రూరల్ : రక్తదానంపై ఇంకా ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించి ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకొచ్చేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ కోరారు. పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలులో లయన్స్ క్లబ్ మంచిర్యాల, గర్మిళ్ల హైటెక్‌సిటీ శాఖల సౌజన్యంతో లయన్స్ క్లబ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ వి.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.
రక్తం అవసరం రోజురోజుకు పెరుగుతోందని, బ్లడ్ బ్యాంకుల్లో సరిపడా రక్తం నిల్వ ఉండడం లేదని తెలిపారు. ఇందుకోసం ప్రతి చోట రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. రక్తదానంపై యువతీ,యువకులు వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. రక్తదానం చేయకూడదనే మూఢనమ్మకాలను పారద్రోలాలని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో రక్తశుద్ధి యంత్రాలు ప్రారంభించామని, త్వరలో నిర్మల్‌కూ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రక్తశుద్ధి యంత్రాలను మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసినవారికి కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, గుడిపేట 13వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎం.శ్రీనివాస్‌కుమార్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్‌పర్సన్ ఆర్.నారాయణ రెడ్డి, ఐఆర్‌సీఎస్ సెక్రటరీ డాక్టర్ అరవింద్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అధ్యక్షుడు కిశోర్‌కుమార్, లయన్స్ జోన్ చైర్‌పర్సన్ ఏ.రాజేశ్వర్‌రావు, మంచిర్యాల, గర్మిళ్ల, హైటెక్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు చెట్ల జనార్దన్, సీహెచ్.నరేందర్‌రెడ్డి, సీహెచ్.హన్మంతరావు, కె.శ్రీధర్‌బాబు, యు.చంద్రమోహన్, పి.పోచమల్లు, కోశాధికారులు వి.వీరస్వామి, ఏ.రాజమౌళి, బి.రాజలింగు పాల్గొన్నారు.
రక్తదానంపై అపోహలు తొలగాలి
Published Fri, Sep 26 2014 1:55 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement