తపాలా: సెండాఫ్ పార్టీ
నేను ప్రస్తుతం ఒక గృహిణిని. చాలా యేళ్ల క్రితం ఒక ఆఫీస్‌లో జాబ్ చేసేదాన్ని. అప్పట్లో మా డిపార్ట్మెంట్లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మిగిలినవాళ్లంతా అబ్బాయిలే. ఎవరితో మాట్లాడాలన్నా, ఏది అడగాలన్నా మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. నాతో పాటు వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయి ట్రైనింగ్ పీరియడ్‌లో ఫ్రెండ్ అయింది. ఇక లంచ్ టైమ్‌లో వాళ్లతో పాటు లంచ్ చేసేదాన్ని. వాళ్లలో చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్లు కూడా ఫ్రెండ్సయ్యారు. టీ బ్రేక్‌లో, లంచ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. రాను రాను మా డిపార్ట్మెంట్ కొలీగ్స్ కూడా క్లోజయ్యారు. మాదే చివరి పెద్ద హాల్. అందులోనే ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేవారు. మాది మూలన కావటంతో బాగా అల్లరి చేసేవాళ్లం. అస్సలు ఆఫీస్‌కి వెళ్లినట్టు ఉండేది కాదు. కాలేజ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టుండేది. కాకపోతే అక్కడ వర్క్ ప్రజర్ ఎక్కువగా ఉండేది. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అలాగే ఓటీలు కూడా చేయాల్సి వస్తుంటే, మాకు మాత్రం ఫుల్‌గా జోక్స్ వేసుకుంటూ జాలీగా వర్క్ చేసేవాళ్లం. నా పక్క సీట్లో ముస్లిం అబ్బాయి, ఇద్దరు హిందువులు, నేను క్రిస్టియన్. నలుగురం ఒకే వరుసలో కూర్చునేవాళ్లం. ప్రతిదీ పంచుకునేవాళ్లం. ఇంక మా డిపార్ట్‌మెంట్‌వాళ్లు సీనియర్స్. వాళ్లతో పాటే ఆఫీస్ స్టార్ట్ అయింది. బర్త్‌డే పార్టీస్‌కి కంపల్సరీగా ఎక్కడికైనా రెస్టారెంట్లోనో, బేకరీలోనో పార్టీ చేసుకునేవాళ్లం. అది చాలా హ్యాపీగా జరిగేది. ప్రతి శనివారం కలర్ఫుల్గా వెళ్లేవాళ్లం. నా పక్క ముస్లిం అబ్బాయి రంజాన్‌కి రోజా ఉండేవాడు. నేను హలీమ్ అడిగితే, పిస్తా హౌస్‌కి రమ్మని ఎగ్గొట్టేవాడు. ‘నువ్వు చాలా పిసినారి’వని మేం తనని వెక్కిరించేవాళ్లం.
అయితే మార్చి 2005లో అనుకుంటా, ఏదో పనిమీద మా మేనేజర్ రూమ్‌కి వెళ్లా. అందరూ చూశారు. ‘ఎందుకెళ్లావు?’ అంటే రిజైన్ లెటర్ ఇవ్వడానికి అని చెప్పా. అందరూ షాకయ్యారు.
‘ఎందు’కని అడిగారు.
‘ఏమో రిజైన్ చేయాలనిపించి ఇచ్చా’ అని చెప్పాను.
ఒక నెల ముందు లెటర్ ఇవ్వాలి. సో! అలా అందరూ కొంచెం అప్సెట్ అయ్యారు. నేను అందరినీ బాగా ఆటపట్టించేదాన్ని. అలా రోజులు గడుస్తున్నాయి.
‘నా చివరి రోజు మార్చి 31’ అని చెప్పా. అందరూ అలాగే అనుకున్నారు.
అయితే వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయి ఈ ముస్లిం అబ్బాయి కొంచెం క్లోజయ్యారు. సెండాఫ్ పార్టీ వాళ్లు 31న అని చెప్పారు. సరే, అదే నాకు ఆఖరి రోజు. మార్చి 31న ఆఫీస్ అయిపోయాక, వాళ్లు నాకు బేకరీలో పార్టీ ఇచ్చారు. పార్టీ అయ్యాక, గుడ్‌బై చెప్పి ఇంటికెళ్లిపోయా.
తెల్లారి ఉదయం ఏప్రిల్ ఫస్టున అందరికంటే ముందెళ్లి చివరి వరుస సీట్లో కూర్చున్నా. అందరూ షాక్.
‘ఏంటీ నిన్నే నీకు చివరిరోజు కదా’ అన్నారు. వాళ్లందర్నీ నేను ఏప్రిల్ ఫూల్ చేసినట్టు తెలిసి, తెగ ఫీలయ్యారు.
- శైలజ, మల్కాజ్గిరి, హైదరాబాద్
చంద్రముఖి నక్షత్రం!
నా పేరు భారతి. మా ఊరు గుంటూరు జిల్లా భట్టిప్రోలు పరిధిలోని ఓలేరు.
మా బాబు పేరు మాధవ్. అల్లరిలో ‘అరవీర భయంకర చిచ్చర పిడుగు’ అనే బిరుదాంకితుడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. వాడు ఏదో ఒక అల్లరిపని చేస్తూనేవుంటాడు. ఏ పనీ లేకపోతే ఆవుదూడ పలుపు ఊడదీసి, దానితో సమానంగా పరుగెడుతూ ఉంటాడు.
వాడికి మూడేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా. ఓ రోజు రాత్రిపూట ఎత్తుకొని తిప్పుతూ అన్నం తినిపించే ప్రయత్నంలో ఉన్నాను. ‘‘ఒరేయ్ మాధవా! అదిగో ఆకాశంలో చందమామ దగ్గరలో బ్రైట్‌గా కనిపిస్తోందే... దాన్ని ‘అరుంధతి’ నక్షత్రం అంటారు నాన్నా’’ అని చెప్పాను.
దానికి వాడు సమాధానంగా, ‘‘అమ్మా! దాని పక్కన ఇంకోటి బ్లైట్గా ఉందే, మరి అది ‘చంద్రముఖి’ నక్షత్రమా?’’అని అడిగాడు. వాడి సినిమా పరిజ్ఞానం అలా ఉంది మరి!
- ఎన్.భారతీకిషోర్
ఓలేరు
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,
మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com