కాంగ్రెస్ ఖాళీ !
చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఇతర పార్టీలకు వలసపోతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధం తెంచుకుంటున్నారు. ఎంతోమందికి రాజకీయభిక్ష పెట్టిన ఈ పార్టీ ఉనికి ఇప్పుడు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిందంటే ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. నిన్నటివరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీని ఆవిర్భావించబోతుండగా, మంత్రిగా వ్యవహరించిన గల్లా అరుణకుమారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయ ఉద్ధండులుగా పేరొంది మూడు నుంచి నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికైన రెడ్డివారి చెంగారెడ్డి, సీకే బాబు, గుమ్మడి కుతూహలమ్మ తోపాటు కిందటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎన్నికైన డాక్టర్ రవి, షాజహాన్ బాషా వంటి నాయకులు కూడా పెట్టేబేడా సర్దుకుంటున్నారు.
జనతా, తెలుగుదేశం పార్టీ ప్రభంజనాలను కూడా తట్టుకుని జిల్లాలో పట్టు నిలుపుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రస్తుతం రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో నేతలు ఇతర పార్టీలకు వరుసగా వలసబాట పడుతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా పేరున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా దొరికే పరిస్థితి లేదు. అత్యధిక మండలాల్లో ఆ పార్టీకి కార్యకర్తలు కూడా లేరు. ఇప్పుడున్న పరిస్థితులు పరిశీలిస్తే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో తిరుపతి లోక్‌సభ సభ్యులు చింతా మోహన్ పెద్ద దిక్కు కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవలనే అమాస రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు.
ఆయన స్థానాన్ని ఎర్రావారిపాళెం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు కంచన వేణుగోపాల్‌రెడ్డితో భర్తీ చేయాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి పట్టిందంటే జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది.
శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు అభ్యర్థులు కరువు
జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం మొదలు కుప్పం వరకు 14 అసెంబ్లీ స్థానాలకు ఒక్కచోట కూడా కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేసి ప్రథమశ్రేణి నాయకులుగా గుర్తింపు పొందిన వారు కనిపించడం లేదు. ఆ పార్టీ ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ను ఛీ కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగితే రాజకీయంగా మనుగడ ఉండదని ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనకు కేంద్రం ఆమోదం తరువాత చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు మొగ్గు చూపిన ప్పటికీ ఖాళీ లేకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తన దారి తాను చూసుకునేలా ఉన్నారు. సత్యవేడులో మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి మూడేళ్ల కిందటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయింది. నగరిలో రెడ్డివారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ పార్టీ మారే యోచనలో ఉన్నారు.
గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ జెడ్పీ చైర్పర్సన్, రాష్ట్ర మంత్రి, శాసనసభ డెప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. చిత్తూరులో నాలుగు దఫాలు (ఒకసారి ఇండిపెండెంట్, అప్పట్లో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి లేరు) ఎమ్మెల్యేగా ఎన్నికైన సీకే.జయచంద్రారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ఎటు వెళ్లాలో ఇంకా తేల్చుకోలేదు. పూతలపట్టు, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో స్పష్టమవుతోంది.