N. ramachandra rao
-
విజయుడు... రామచంద్రుడు
-
విజయుడు... రామచంద్రుడు
బీజేపీలో ఆనందోత్సాహాలు నగరంలో భారీగా సంబరాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు విజయదుందుభి మోగించడం నగరంలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపింది. బుధవారం రాత్రి వారంతా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోవడానికి ఈ గెలుపు దోహదం చేస్తుందని నాయకులు, కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామచంద్రరావు రూపంలో లభించిన ఘన విజయం పార్టీ ఓటు బ్యాంకును సమీకరించడానికి తోడ్పడుతుందని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. హైదరాబాద్‌లో రాజకీయ పునరేకీకరణకు... ప్రధాన పక్షంగా బలం సాధించుకునేందుకు వీలవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వెల్లివిరిసిన ఆనందం ఓ వైపు టీవీ చానెళ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే నగరంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా పేల్చి... రంగులు చల్లుకొని... సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. కేరింతలు కొట్టారు. మరోవైపు నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకున్నారు. -
మండలికి బీజేపీ రెడీ!
* పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా రామచంద్రరావు పేరు ఖరారు * అధికారపార్టీలో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ * కౌన్సిల్ సమరానికి కాంగ్రెస్ దూరం! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి బరిలో ఎన్.రామచంద్రరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలో జరిగే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇదే స్థానం నుంచి రామచంద్రరావు పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకు పరాభవమే ఎదురైంది. మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దిగిన రామచంద్రరావు సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కనకారెడ్డి చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. హైకోర్టు న్యాయవాదిగా సుపరిచితులైన రామచంద్రరావు బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్దలసభకు రామచంద్రరావు అభ్యర్థిత్వానికి కమల నాయకత్వం పచ్చజెండా ఊపింది. వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాగేశ్వర్ ఈ సారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదనే సంకేతాలు బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వామపక్ష పార్టీలు బలపరిచిన నాగేశ్వర్‌కు గతంలో టీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. ఈ సారి కమ్యూనిస్టు పార్టీలు మరొకరిని తెరమీదకు తేవాలని భావిస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో నాగేశ్వర్ పోటీ చేయకపోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. విద్యావంతుల్లో అంతగా పట్టులేదని భావిస్తున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనే భావిస్తోంది. కాగా, విజయోత్సాహంతో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావహులు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయ సంఘం నేత వెంకటరెడ్డి ఆ పార్టీ నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, పట్టభద్రుల నియోజకవర్గంలో స్థానికేతరుల అభ్యర్థిత్వాన్ని అంగీకరించేదిలేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ అనుకూల విద్యార్థి నేతలు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా, పట్టభద్రుల ఓటర్ల నమోదుకు గడువును వచ్చేనెల 6వ తేదీవరకు పొడిగించారు. -
పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి నిర్వహించనున్న ఎన్నికల్లో అభ్యర్థిగా రాష్ట్రపార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పదవీకాలం మార్చి చివర్లో ముగియనుండటంతో ఈ ఖాళీ ఏర్పడనుంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రామచంద్రరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డా.మల్లారెడ్డి (రంగారెడ్డిజిల్లా) పోటీపడుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్రఎన్నికలకమిటీ రామచంద్రరావు పేరును ఎంపికచేసి జాతీయనాయకత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అతనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మద్దతుందని చెబుతున్నారు. -
రాజ్‌నాథ్ పర్యటన వాయిదా
అనారోగ్య కారణాలతో నేటి పర్యటన రద్దు సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. గత నెల 21న జరగాల్సిన ఆయన పర్యటన నేటికి వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలవల్ల రాజ్‌నాధ్ బుధవారం కూడా రాష్ట్రానికి రావడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు రాంలాల్, సతీష్, మురళీధర్‌రావు వస్తున్నారని, నిర్దేశిత కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని వారు చెప్పారు. పార్టీ పునర్నిర్మాణం, సీమాంధ్ర ఉద్యమం, అంతర్గత కలహాలు, పోటీ చేసే నియోజకవర్గాలు తదితర అంశాలను కోర్‌కమిటీ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. పార్టీ తొలి ప్రాధాన్యత జాబితాలో ఉన్న సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నిజమాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి లోక్‌సభస్థానాల అభ్యర్థుల పేర్లు కేంద్ర నాయకత్వానికి చేరాయి. వీరిలో బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లు ఉన్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తు వ్యవహారమై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో గత పొత్తులు, గెలిచిన సీట్లు వంటి వాటిని మరోసారి సమీక్షించనున్నారు. టీడీపీతో పొత్తు వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టుగా భావిస్తున్న వెంకయ్య నాయుడు కూడా బుధవారం జరిగే సమావేశాలకు హాజరుకావడం లేదని తెలిసింది.