మండలికి బీజేపీ రెడీ!
* పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా రామచంద్రరావు పేరు ఖరారు
* అధికారపార్టీలో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ
* కౌన్సిల్ సమరానికి కాంగ్రెస్ దూరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి బరిలో ఎన్.రామచంద్రరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలో జరిగే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇదే స్థానం నుంచి రామచంద్రరావు పోటీచేసి ఓటమిపాలయ్యారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకు పరాభవమే ఎదురైంది. మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దిగిన రామచంద్రరావు సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి కనకారెడ్డి చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. హైకోర్టు న్యాయవాదిగా సుపరిచితులైన రామచంద్రరావు బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
శాసనమండలి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్దలసభకు రామచంద్రరావు అభ్యర్థిత్వానికి కమల నాయకత్వం పచ్చజెండా ఊపింది. వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాగేశ్వర్ ఈ సారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదనే సంకేతాలు బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
వామపక్ష పార్టీలు బలపరిచిన నాగేశ్వర్‌కు గతంలో టీఆర్‌ఎస్ కూడా మద్దతు పలికింది. ఈ సారి కమ్యూనిస్టు పార్టీలు మరొకరిని తెరమీదకు తేవాలని భావిస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో నాగేశ్వర్ పోటీ చేయకపోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. విద్యావంతుల్లో అంతగా పట్టులేదని భావిస్తున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనే భావిస్తోంది. కాగా, విజయోత్సాహంతో ఉన్న అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మాత్రం ఆశావహులు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయ సంఘం నేత వెంకటరెడ్డి ఆ పార్టీ నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, పట్టభద్రుల నియోజకవర్గంలో స్థానికేతరుల అభ్యర్థిత్వాన్ని అంగీకరించేదిలేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లాలోని టీఆర్‌ఎస్ అనుకూల విద్యార్థి నేతలు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా, పట్టభద్రుల ఓటర్ల నమోదుకు గడువును వచ్చేనెల 6వ తేదీవరకు పొడిగించారు.