ఉగ్రవాదంపై నిర్దిష్ట పోరు
- ఇందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి
- నామ్ సదస్సులో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ
పొర్లమర్ (వెనిజులా): ఉగ్రవాదంపై నిర్దిష్ట పోరు సాగించాలని, ఇందుకోసం నామ్ (అలీనోద్యమం) సభ్యత్వం గల 120 దేశాలు కలసి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భారత్ పిలుపునిచ్చింది. ఆదివారం ఈమేరకు వెనిజులాలో జరుగుతున్న 17వ నామ్ శిఖరాగ్ర సమావేశాల్లో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘలనకు పాల్పడుతున్న వాటిలో అతి భయంకరమైనది ఉగ్రవాదం. అది దేశాల భద్రతకు, సార్వభౌమత్వానికి, అభివృద్ధికి ప్రధాన ముప్పు. ఉగ్రవాదంపై పోరుకు సమయం ఆసన్నమైంది. ఇందుకు నామ్ నేతృత్వంలో ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
సమన్వయంతో ఉగ్రవాదంపై పోరు సాగించేందుకు అది ఉపయోగపడుతుంది’ అని అన్నారు.నామ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదంపై ఓ క్రియాశీల బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే తమ పొరుగు దేశం అడ్డుకుందని పాక్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై స్పందిస్తూ.. 21వ శతాబ్దానికి అనుగుణంగా భద్రతా మండలికి వెంటనే సంస్కరణలు చేపట్టాలని 2005లో జరిగిన యూఎన్ శిఖరాగ్ర సమావేశాల్లో పలు దేశాల నేతలు అభిప్రాయపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎంజే అక్బర్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి, సుస్థిరత, సమృద్ధి కోసం ఉగ్రవాదంపై పోరుకు ఓ క్రియా శీల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ‘కొన్ని ప్రభుత్వాలు నామ్ సమ్మిట్‌లో చిత్తశుద్ధి గురించి తెగ మాట్లాడుతాయి. కాని ఉగ్రవాదానికి చేయూత, ఆశ్రయం కల్పించడం మాత్రం కొనసాగిస్తాయి’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.