Nachindi Girl Friendu Movie
-
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ వంటి చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు కట్టిపడేశావు అని ఆడియన్స్ అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఆ థ్రిల్, ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రావు’’ అని చిత్ర దర్శకుడు గురు పవన్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జంటగా నటించిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం విజయోత్సవంలో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదరిస్తామని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల షోలు పెంచుతున్నారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమా తీశారనే మంచి పేరు వచ్చింది’’ అన్నారు అట్లూరి నారాయణ రావు. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. -
‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ మూవీ రివ్యూ
టైటిల్: నచ్చింది గాళ్ ఫ్రెండూ నటీనటులు: ఉదయ్ శంకర్, జెన్నీఫర్ ఇమ్మానుయేల్, సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ నిర్మాణ సంస్థ:శ్రీరామ్ మూవీస్ నిర్మాత: అట్లూరి నారాయణ రావు దర్శకత్వం: గురు పవన్ సంగీతం: గిఫ్టన్ సినిమాటోగ్రఫర్:సిద్దం మనోహార్ ఎడిటర్: ఉడగండ్ల సాగర్ విడుదల తేది: నవంబర్ 11,2022 కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఒకే రోజులో జరుగుతుంది. బీకామ్ చదివిన రాజా(ఉదయ్ శంకర్) జులాయిగా తిరుగతూ.. షేర్ మార్కెట్లో పెడ్డుబడులు పెడుతుంటాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలలో శాండీ(జెన్నీఫర్ ఇమ్మానుయేల్) ఫోటో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. స్నేహితుడు చెర్రీ( మధునందన్) ఇంటర్వ్యూ కోసమని బైక్‌పై వెళ్తుంటే దారి మధ్యలో శాండీ కనిస్తుంది. ఆ రోజు శాండీ బర్త్‌డే. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు శాండీ వెళ్తుంటే.. ఓ అపరిచితుడి నుంచి ఆమె మొబైల్ ‘ఈ రోజు నువ్వు ఎవరితో మాట్లాడినా..వాళ్లు చనిపోతారు’ అనే సందేశం వస్తుంది. కానీ శాండీ దాన్ని జోక్‌గానే తీసుకుంటుంది. అయితే నిజంగానే శాండీ ఎవరితో మాట్లాడిన వారు హత్య చేయబడతారు. రాజా కూడా శాండీతో మాట్లాడతాడు. ప్రేమిస్తున్నానని చెబుతాడు. శాండీ కూడా రాజాని ప్రేమించినట్లు చేస్తుంది. కట్ చేస్తే..కాసేపటికే రాహుల్ అనే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని, త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతుంది. శాండీ ఎందుకలా చేసింది? ఆమె నేపథ్యం ఏంటి? శాండీకి సందేశం పంపిన ఆ అపరిచితుడు ఎవరు? ఆమెతో మాట్లాడిని వారిని ఎందుకు హత్య చేశారు? విక్రమ్ రాయ్ ఎవరు? కృష్ణ పాండే(శ్రీకాంత్ అయ్యంగార్) వల్ల ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆపదలో ఉన్న శాండీని రాజా ఎలా కాపాడాడు? చివరకు రాజా,శాండీ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. దర్శకుడు గురు పవన్ ఓ లవ్‌స్టోరీని ఆన్ లైన్ ట్రేడింగ్‌తో ముడిపెట్టి కథను రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా రొటీన్ లవ్ సీన్స్‌తో సోసోగా సాగుతుంది. శాండీని రోడ్డుపై చూడడం.. ఆమె వెంటపడడం.. చివరకు రాజా ప్రేమలో శాండీ పడడం..ఇలా ప్రథమార్థం సింపుల్‌గా సాగుతుంది. కానీ అసలు ఆ మర్డర్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తిని రేకిస్తాయి. ఇంటర్వెల్ ముందు కాస్త సస్పెన్స్ వీడుతుంది. ఇక సెకండాఫ్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. షేర్ మార్కెట్ మోసాలు, మధ్య తరగతి వాళ్ల మీద ఉండే ప్రభావం తదితర అంశాలను టచ్ చేస్తూ సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే స్పీచ్ బాగుంటుంది. సెకండాఫ్ మాదిరే ఫస్టాఫ్ కూడా బలంగా ఉండి ఉండే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి ‘నచ్చింది గాల్ ఫ్రెండూ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా అంతా ఉదయ్ శంకర్, జెన్నీఫర్ చుట్టే తిరుగుతుంటుంది. రాజా పాత్రకి ఉదయ్ శంకర్ న్యాయం చేశాడు. ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా కనిపిస్తూనే.. సెకండాఫ్‌లో తనలోని మాస్ యాంగిల్‌ని చూపించాడు. డైలాగ్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. శాండీగా జెన్నీఫర్ ఇమ్మానుయేల్ మెప్పించింది. ఆమెకిది తొలి సినిమా.అయినప్పటికీ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. మధు నందన్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. కృష్ణ పాండే పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒదిగిపోయాడు. తెరపై కనిపించేదే కాసేపే అయినా.. కథను మలుపు తిప్పే పాత్ర తనది. సుమన్, పృధ్వీరాజ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. గిఫ్టన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సిద్దం మనోహార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వైజాగ్ అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ ఉడగండ్ల సాగర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచేప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. -
‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’లో ప్రత్యేకత ఇదే : నిర్మాత
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ "నచ్చింది గాళ్ ఫ్రెండూ". జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మించారు. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు (ఈ నెల 11) ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అట్లూరి నారాయణరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►హీరో నారా రోహిత్ నాకు మంచి మిత్రుడు. నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నప్పుడు ఆయనకు చెబితే ముందు డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఇన్వాల్వ్ అవడం ..బిజినెస్ తెలుకున్నాక ప్రొడ్యూసింగ్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అలా నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమాను కొన్ని ఏరియాలు పంపిణీ చేశాం. తర్వాత శ్రీవిష్ణు హీరోగా నీదీ నాదీ ఒకే కథ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మా సంస్థకు కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రసంశలు అందించింది. ►ఉదయ్ శంకర్ నాన్న శ్రీరామ్ గారు మా గురువుగారు. ఉదయ్ నటించిన ఆటగదరా శివా, మిస్ మ్యాచ్, క్షణక్షణం వంటి చిత్రాలు చూశాక...ఆయన హీరోగా మంచి థ్రిల్లర్, హ్యూమర్ సినిమాలు చేయొచ్చు అనిపించింది. చెన్నైలో కొందరు దర్శకులు, రచయితలు చెప్పిన కథలు విన్నా అవి ఆకట్టుకోలేదు. గురుపవన్ తనకు చెప్పిన కథ గురించి ఉదయ్ మాతో డిస్కస్ చేశారు. ఆ కథ మేమూ విన్నాం. బాగా నచ్చడంతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాం. ► ఉదయ్ కామెడీ బాగా డీల్ చేయగలడు. అందుకే ఈ చిత్రాన్ని కేవలం థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కాకుండా కామెడీ, రొమాన్స్ చేర్చాం. లవ్ స్టోరి అంటే కేవలం ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడటం, బాధ్యత లేకుండా తిరగడం చూపిస్తుంటారు. ఈ సినిమా అలా ఉండదు. మన యువతకూ కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు, దేశం పట్ల ప్రేమ ఉన్నాయని చెబుతున్నాం. అదే ఈ మూవీలో ప్రత్యేకత. ► ఉదయ్ రాజారాం పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మధునందన్ ఫ్రెండ్ రోల్ చేశాడు. ఈ మూడు పాత్రల మధ్యే మేజర్ సినిమా సాగుతుంది. ఇది రోడ్ జర్నీ మూవీ కాదు. కొన్ని సీన్స్ ఉంటాయి. సినిమా మేకింగ్ లో మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు. సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ► దర్శకుడు గురుపవన్ కథ ఎలా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. చెప్పిన షెడ్యూల్స్ చెప్పినట్లు కంప్లీట్ చేశాడు. ఒక టీమ్ లా అంతా కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలో ఉదయ్ తో మరో సినిమా చేస్తున్నాం. అలాగే నారా రోహిత్ హీరోగా ఓ చిత్రాన్ని, ఓ పెద్ద హీరోతో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ నెక్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్తాయి. -
ఆ సీన్ కోసం తక్కువ తిన్నా: హీరోయిన్
ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా గురుపవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో జెన్నిఫర్ మాట్లాడుతూ – ‘‘నా స్వస్థలం ముంబై. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేసిన తర్వాత జర్నలిజంలో డి΄÷్లమా కోర్సు చేశాను. ఆ తర్వాత యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో ΄ాటు భరత నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నాకు ‘బాయ్స్ విల్ బీ బాయ్స్’ అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే సినిమాటోగ్రాఫర్‌గా చేసిన మనోహర్‌గారు ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’కు నన్ను ప్రిఫర్ చేశారు. ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న సంధ్య అనే పాత్ర చేశాను. కొన్ని సన్నివేశాల కోసం బికినీ ధరించాను. అయితే దర్శకుడు నన్ను అందంగా చూపించారు కానీ అసభ్యంగా చూపించలేదు. అలాగే ఓ సీన్ కోసం రెండు రోజులు చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నాను. దర్శకులు గురు పవన్‌గారికి కథ పట్ల మంచి క్లారిటీ ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, హీరోయిన్స్‌లో సమంత అంటే ఇష్టం’’ అని అన్నారు. -
'నచ్చింది గాళ్ ఫ్రెండూ'.. చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది : డైరెక్టర్
ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ నాయికగా నటిస్తోంది. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలోఅట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతున్న చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు గురు పవన్. ►నా మొదటి సినిమా ఇదే మా కథ. శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సినిమా విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఉదయ్ శంకర్ గతంలో మంచి మూవీస్ చేశారు. ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ వంటి చిత్రాలు ఆయన నట ప్రతిభ చూపించాయి. ఈ సినిమా కూడా ఉదయ్ కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. ►వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలుంటాయి. రోడ్ జర్నీ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఉదయ్ క్యారెక్టర్ ఏంటంటే, తను ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే ఆమెను ప్రేమలో పడేస్తాడు. హీరోయిన్ ను ట్రాఫిక్ లో చూసి తనను ఛేజ్ చేసి లవ్ చేసేలా చేస్తాడు. ఈ క్యారెక్టర్ లో తన నటన ఆకట్టుకుంటుంది. ►హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మానుయేల్ గతంలో ఓ చిన్న సినిమాలో నటించింది కానీ ఇది తనకు రియల్ డెబ్యూ అనుకోవచ్చు. తన పాత్రకు తగినట్లు ఎలా చెబితే అలా నటించింది. రోడ్ జర్నీ షూట్లో ఎండలో కష్టపడింది. ఏ రోజూ షూటింగ్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. కొత్త అమ్మాయి అయినా ఆమెకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. ►ఈ సినిమాలో ఇప్పటిదాకా తెరపై చూడని ఒక అంశాన్ని చెప్పబోతున్నాం. మనందరి ఫోన్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా ఒక తప్పు జరిగితే దేశవ్యాప్తంగా ఎంతమంది నష్టపోతారు. వారిని సమస్య నుంచి హీరో ఎలా బయటపడేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్వెస్ట్ మెంట్ యాప్ సమస్యను ఒక సూపర్ హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిగా తనకున్న ప్రతిభతో పరిష్కరిస్తాడు. దేశంలో జరిగిన ఈ పెద్ద ఘటన నేపథ్యాన్ని ప్రేమ కథకు ముడిపెట్టాం. ►సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్ పాత్రలు కీలకంగా ఉంటాయి. వారు తమ బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చారు. ఈ కథను అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చేందుకు నిర్మాత అట్లూరి నారాయణ రావు గారి సపోర్ట్ ఎంతో ఉంది. ఏ రోజూ మా టీమ్ లోని ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విషయాల్లో సినిమా ఉన్నతంగా ఉంటుంది. సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ, గిఫ్టన్ మ్యూజిక్ హైలైట్ అవుతాయి. మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు గిఫ్టన్. ఈనెల 11న మీ ముందుకొస్తున్నాం. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. -
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ కాన్సెప్ట్ ఆసక్తిగా ఉంది: వెంకటేశ్
‘‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా ఆసక్తిగా ఉంది.. విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఈ మూవీతో ఉదయ్ శంకర్‌కి, యూనిట్‌కి మంచి విజయం రావాలి’’ అని హీరో వెంకటేష్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా మధునందన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. గురు పవన్ దర్శకుడు. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని వెంకటేష్ రిలీజ్ చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక రోజు జరిగే కథే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఉన్న మా సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ కంటెంట్‌గా రూపొందిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహార్, సంగీతం: గిఫ్టన్. -
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’అంటున్న ఉదయ్ శంకర్
గురు పవన్ దర్శకత్వంలో యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జెన్నీ హీరోయిన్గా నటిస్తుండగా, మధునందన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ మూవీ టైటిల్‌ని రివీల్ చేసింది చిత్రబృందం. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ని వదిలారు. అందులో హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న హీరోని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. ఈ పోస్టర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారు.