Nadimatla Sridhar
-
సింగరేణి సీఎండీగా శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను టీ సర్కార్ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సీఎండీగా శ్రీధర్ నియామక ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. శ్రీధర్‌ను పిలిచి సీఎం స్వయంగా ఈ నియామక విషయాన్ని తెలిపారు. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు తెలంగాణ బిడ్డను చైర్మన్‌గా చేయటం తనకు వ్యక్తిగతంగా ఆనందంగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సింగరేణి కాలరీస్‌ను పటిష్టమైన సంస్థగా తీర్చిదిద్దాలని అన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు శ్రీధర్ ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 1997 బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ గతంలో సీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. వరంగల్, కృష్ణా, అనంతపురం కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. శ్రీధర్‌ను సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు అభినందించారు. కాగా, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయనను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కలెక్టర్ బదిలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠకు తెర వీడింది. జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌గా ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. కొత్తవారిని నియమించేవరకు శ్రీధ ర్ పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు కూడా ఆయనే ఇన్చార్జిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ గత జూన్ 17న కలెక్టర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుఅభిమానాన్ని చూరగొన్న శ్రీధర్.. ప్రతిష్టాత్మక సింగరేణి చైర్మన్ గిరిని దక్కించుకోగలిగారు. శ్రీధర్ పేరుకు కేంద్రం కూడా ఆమోదముద్ర వేయడంతో ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సీఎండీగా నియమిస్తూ బదిలీ చేసింది. కాగా, కొత్త కలెక్టర్ ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కీలక జిల్లాగా పరిగణించే ఈ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజన ప్రక్రియకు బుధవారం పుల్‌స్టాప్ పడనున్న నేపథ్యంలో జరిగే బదిలీల్లో రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ పదవికి ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణలు, సీఎం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్‌కు ఖరారు కావడంతో బుధవారం ఆయన ఏపీ రాష్ట్రం నుంచి రిలీవ్ కానున్నారు. కలెక్టర్ శ్రీధర్ నిర్వహించిన పదవులు కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో 1971 జూన్ 1న జన్మించిన శ్రీధర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్(ఈసీఈ) పూర్తి చేశారు. 1997లో ఐఏఎస్ ఎంపికైన ఆయన తొలుత రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అక్కడి నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, పోర్టుల డెరైక్టర్‌గా కాకినాడలో విధులు నిర్వర్తించారు. అనంతరం అనంత పురం, కృష్ణా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా సీఎంవోలో ముఖ్య భూమిక పోషించారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన సుమారు ఆరు నెలలపాటు జిల్లాలో సేవలందించారు. కాగా, నాలుగు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అధికారిగానే కాకుండా... సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపడుతున్న యువ ఐఏఎస్‌గా శ్రీధర్ గుర్తింపు పొందనున్నారు. -
సింగరేణి సీఎండీగా కలెక్టర్ శ్రీధర్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కలె క్టర్ నడిమట్ల శ్రీధర్ అతి త్వరలో బదిలీ కానున్నారు. ప్రతిష్టాత్మక సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అంద జేసింది. ప్రస్తుతం కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న శ్రీధర్ ఈ పోస్టును చేపడుతున్న అతి పిన్న వయస్కుడు. ఈ పదవిలో కొనసాగిన సుదీర్థ భట్టాచార్య ఇటీవల కోల్ ఇండియా కార్పొరేషన్ చైర్మన్‌గా వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో శ్రీధర్ పేరును పరిశీలించిన రాష్ట్ర సర్కారు.. కేంద్రానికి ఈయన పేరును సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దేశంలోనే బొగ్గు ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన సంస్థల్లో ఒకటైన సింగరేణి సీఎండీ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమల స్థాపన, భూముల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో కీలక భూమిక వహిస్తున్నారు. కాగా, అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియకు ప్రధాని ఆమోదం తెలిపిన తరుణంలో రాష్ట్రంలో పెద్దఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలుగనుంది. ఈ బదిలీల పర్వంలోనే జిల్లా కలెక్టర్ శ్రీధర్ కూడా సింగరేణి సీఎండీగా వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, కలెక్టర్ మార్పిడి తప్పనిసరి అనే వార్తల నేపథ్యంలో కొత్త కలెక్టర్ ఎవరనేది చర్చనీయాంశమైంది. -
దుకుడు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం. తగవుల్లేని భూముల కేటాయింపుతో పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం మా ప్రధాన కర్తవ్యం’ అని జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్ట్, యూఎల్సీ, సీలింగ్, అసైన్మెంట్ భూముల సర్వేలో దూకుడు ప్రదర్శిస్తూ... గతి తప్పిన సర్కారీ శాఖలను గాడిలో పెట్టేదిశగా కార్యాచరణ సిద్ధం చేసిన కలెక్టర్ శ్రీధర్ సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే... ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రాధాన్యాతాంశాల్లో మొదటిది ప్రభుత్వ భూముల పరిరక్షణ. జిల్లాలోని వివిధ కేటగిరీల కింద పంపిణీ/బదలాయించిన 1.50 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేసి అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నాం. వివిధ సంస్థలకు కేటాయించిన 39 వేల ఎకరాల్లో ఆయా సంస్థలు ఏ మేరకు వాడుకున్నాయనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుమారు 13వేల ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని గుర్తించా. ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్‌లో భూముల సర్వే పూర్తయింది. 200 ఎకరాల్లో బహుళ అంతస్తులు, మరో 200 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు వెలిశాయి. మిగతా భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం. ఇప్పటికే కొన్నింటిని జీహెచ్ఎంసీ కూల్చేసింది. మిగతావాటి విషయంలోను త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ‘ఎన్’ కన్వెన్షన్‌లో తమ్మడి కుంట.. ‘ఎన్’ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం. తమ్మడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3.24 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లు సర్వేలో తేలింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నాం. గురుకుల్ ట్రస్ట్ భూమిని క్రమబద్ధీకరించాలని యూఎల్సీ వద్ద 2,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో కూడా కేసులు ఉన్నందున.. ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తాం. పరిశ్రమలకు లిటిగేషన్ లేని భూములు ఐటీ, ఫార్మా రంగాలకు అనువైన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు భూములను సమీకరిస్తున్నాం. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న 13వేల ఎకరాల భూములేగాక వేర్వేరు చోట్ల బిట్లుబిట్లుగా ఉన్న ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించేలా జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ తయారు చేసేలోగా ల్యాండ్ బ్యాంక్‌ను రెడీ చేసుకోవాలని నిర్ణయించాం. భూమిలేని పేదలకు పంపిణీ చేసిన లక్ష ఎకరాల అసైన్డ్భూములను కూడా సర్వే చేయిస్తున్నాం. శివారు మండలాల్లో 2,500 ఎకరాల యూఎల్సీ భూములను కూడా రీసర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. దళితుల సమగ్రాభివృద్ధి దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాం. భూమిలేని 4,700 కుటుంబాల్లో తొలి విడతగా పంద్రాగస్టున కొందరికి భూ పంపిణీ చేస్తాం. పనిదొంగల భరతం పడతా.. సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తా. రోజూ కలెక్టరేట్ నుంచి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? లేదా అనే ది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకే ఫోన్ చేస్తా. 64 మందికి శ్రీముఖాలు విధుల్లో అలసత్వం వహించినందుకే వైఖరి మారకుంటే వేటు: కలెక్టర్ శ్రీధర్ విధినిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగులపై కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీరియస్ అయ్యారు. గతవారంలో వరుసగా రెండ్రోజుల పాటు కొందరు అధికారులతో సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. అనంతరం వారి నుంచి వచ్చిన నివేదికలపై సమీక్షించారు. అయితే ఇందులో చాలావరకు వసతిగృహ అధికారులు, ప్రభుత్వ వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించి తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం వహించిన 64 మందికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఇందులో 32 మంది సంక్షేమాధికారులు కాగా, మిగిలిన వారు పీహెచ్సీ వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు.