సింగరేణి సీఎండీగా శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను టీ సర్కార్ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సీఎండీగా శ్రీధర్ నియామక ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. శ్రీధర్‌ను పిలిచి సీఎం స్వయంగా ఈ నియామక విషయాన్ని తెలిపారు.
సింగరేణి లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు తెలంగాణ బిడ్డను చైర్మన్‌గా చేయటం తనకు వ్యక్తిగతంగా ఆనందంగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సింగరేణి కాలరీస్‌ను పటిష్టమైన సంస్థగా తీర్చిదిద్దాలని అన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు శ్రీధర్ ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 1997 బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ గతంలో సీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. వరంగల్, కృష్ణా, అనంతపురం కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. శ్రీధర్‌ను సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు అభినందించారు. కాగా, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయనను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.