నంద్యాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ఐదు రోజులుగా నంద్యాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్, బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి.
ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
ముంపు ప్రాంతాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం పర్యటించారు. మహానంది మండలం గాజులపల్లెలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స అన్నారు. మంత్రుల వెంట ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు.