నిన్ను చూసి ఓట్లేయలేదు?
పార్టీ విప్ ధిక్కరించిన ఎంపీటీసీని నిలదీసిన ప్రజలు
బాపట్ల రూరల్: ‘ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపిస్తే... నిలువెత్తున ముంచేసి టీడీపీకి ఎందుకు మద్దతు తెలిపావు?.. నిన్ను చూసి ఓట్లువేయలేదని.. జగనన్నను చూసి ఓట్లువేశామంటూ ప్రజలు మండిపడ్డారు.. నీముఖం మాకు చూపించవద్దు’ అంటూ ఈతేరు ఎంపీటీసీ సభ్యురాలు కాగిత నాగభూషణమ్మపై మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈతేరులో సోమవారం ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రాజన్నపై ఉన్న ప్రేమను ఈతేరు, చుండూరుపల్లి, మర్రిపూడి గ్రామస్తులు మరోసారి చాటుకున్నారు. మొదటి నుంచి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న మర్రిపూడి, చుండూరుపల్లి, ఈతేరు గ్రామాల్లోని ప్రజలు తమ పార్టీ అభ్యర్థినిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి తిరిగి విజయవాడ నుంచి స్వగ్రామానికి వచ్చిన నాగభూషణమ్మను ప్రజలు నిలదీశారు.
తన ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానని ఒకసారి, నన్ను అడిగేందుకు మీరెవరంటూ మరోసారి సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. పార్టీని, ఓట్లు వేసిన గ్రామస్తులను మోసం చేశావంటూ ఎంపీటీసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఐ మల్లికార్జునరావు, రూరల్, వెదుళ్ళపల్లి ఎస్ఐలు చెన్నకేశవులు, సురేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పారు.