ప్రత్యేక హోదా కోసం పోరాటం
కల్లూరు (రూరల్) : ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. అనంతరం నిరసన ప్రదర్శనతో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాగమధు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే కేంద్ర మంత్రులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఖాశీం, నగర అధ్యక్షుడు ప్రదీప్, ఎస్టీబీసీ కళాశాల అధ్యక్షుడు మహేంద్ర, హరీష్, ప్రకాశ్ పాల్గొన్నారు.
ప్రత్యేక హోదాపై ఆందోళనలు ఉద్ధృతం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌పై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హబీబుల్లా తెలిపారు. మంగళవారం స్థానిక వడ్డెగేరిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా కల్పించడం కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, ఉపాధ్యక్షులు జమృత్ సుల్తానా, కోశాధికారి రియాజ్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అడ్వకేట్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.