ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
చిల్లకూరు: ఓ వినియోగదారుడి నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ సురేశ్ కుమార్ కు పారిచర్లవారిపాలేనికి చెందిన నాగముని అనే వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోరుతూ వినతి పత్రం అందజేశారు.
అయితే, రోజులు గడుస్తున్నా ఆయన విన్నపాన్ని ఏఈ పట్టించుకోలేదు. తనకు రూ.1.20 లక్షలు ఇస్తేనే పని అవుతుందని స్పష్టం చేశాడు. దీంతో నాగముని ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు నాగముని గురువారం మధ్యాహ్నం చిల్లకూరు విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్న సురేశ్ కుమార్ కు రూ.1.20 లక్షల లంచం అందిస్తుండగా మాటువేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏఈను విచారిస్తున్నారు.