మేం చేసిన తప్పేంటి?
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
అవనిగడ్డ : అవనిగడ్డలోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌ను అభ్యర్థించడమే తప్పా అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీ నగరాయులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పార్టీ జెండా ఆవిష్కరించి కార్యాలయంలోని దీనదయాళ్, శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ వంటి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేయాలని కామినేనిని కోరితే ఆయనను తప్పుదోవ పట్టించి గందరగోళాన్ని సృష్టించిన జిల్లా నాయకత్వమే దీనికి బాధ్యత వహించాలన్నారు. వ్యాపార రాజకీయాలు చేస్తున్న జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి చిరువోలు బుచ్చిరాజు వర్గీయుల కుట్రపూరిత చర్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
పార్టీ నియమావళిని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, సంస్థాగత కార్యదర్శి రవింద్రరాజు, ప్రధాన కార్యదర్శి జె.శ్యామకిషోర్ను కోరామని ఆయన చెప్పారు. గుంటూరు బసవయ్య, శోభిల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.