కళల కాణాచి భారతదేశం
వైవీయూ :
కళల కాణాచి భారతదేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ‘రంగధామ–2016’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు శారీరక ఆరోగ్యం కోసం ఆటలు ఎంతో అవసరమన్నారు. అదే విధంగా మానసిక ఆరోగ్యం, వికాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు. భారతదేశం అనాధిగా కళలకు పెట్టింది పేరన్నారు. మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించే ఇటువంటి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కళాశాల అధినేత బైరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఏ కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో పాల్గొంటూ దానిని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రంగధామ కార్యక్రమం ఈనెల 1నుంచి 11వ తేదీ వరకు రోజుకో విభాగంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కళాశాలలో రంగోలి పేరుతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల విభాగం కోఆర్డినేటర్ సుబ్బనరసయ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.