జారిపోతాంది..
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ‘అడ్డదిడ్డమైన కొలతల కారణంగా విద్యార్థులకు యూనిఫాం సరిపడక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి విద్యార్థి కొలతలు తీసుకునే యూనిఫాం కుట్టించాలి. లేనిపక్షంలో బిల్లులు చేసే ప్రసక్తే ఉండదు’ అని రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఎస్పీడీ) ఉషారాణి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించారు. అయితే ఆచరణలో పరిస్థితి తారుమారైంది.
అనంతపురం నగరంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో నాగేష్ నాయక్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఈ ఏడాది రెండు జతల యూనిఫాం ఇచ్చారు. అవి చాలా బిగుతుగా ఉన్నాయి. చేసేది లేక రోజూ కలర్ డ్రెస్‌తోనే పాఠశాలకు వస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి విద్యార్థులెందరూ ఇక్కట్లు పడుతున్నారు. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1-8 తరగతుల విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫాంను ఆర్వీఎం ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 1-10 తరగతుల విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల యూనిఫాం ఆయా శాఖలు పంపిణీ చేస్తున్నాయి. అయితే, ఇవి పట్టుమని పది రోజులు కూడా వేసుకునే విధంగా ఉండడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1-8 తరగతుల విద్యార్థులు 3,07,431 మంది ఉన్నారు. వీరికి 6,14,862 జతలు ఇవ్వాల్సి ఉంది. 125 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 9,500 మంది, 91 బీసీ హాస్టళ్లలో 13,200 మంది, 18 గిరిజన సంక్షేమ హాస్టళ్లలో 1753 మంది 1-10 తరగతుల విద్యార్థులు ఉంటున్నారు. పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థుల యూనిఫాం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.16 కోట్లు ఖర్చు చేస్తోంది.