ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో..
చదివింది ఇంజినీరింగ్..తర్వాత క్రియేటివిటీకి దగ్గరగా ఉంటుందని ఇంటీరియర్ డెకరేటర్‌గా పని చేసినా ఏదో అసంతృప్తి. ఎందుకో యాంత్రిక జీవితానికి అలవాటుపడటం అమెకు నచ్చలేదు. తన చిన్నతనంలో పల్లెల్లో జీవనశైలిపై తల్లిదండ్రులు, పెద్దలు చెప్పే కథలు ఆమెకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని సంప్రదాయాలు, అక్కడి జీవన విధానం అంటే అమెకు అమితమైన ఆసక్తి. పేయింటింగ్స్ పై ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా, మంచి పేయింటింగ్ వేయాలన్న ఆసక్తి మాత్రం ఆమెకు ఎక్కువగా ఉండేది. దీంతో ఎంతగానో ఇష్టపడే పెయింటింగ్నే తన ప్రొఫెషన్‌గా మలుచుకుంది. అందులోనూ పల్లెల్లో జీవన విధానంపై ఆమె గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరిని చిన్నతనంలోకి తీసుకువెళతాయి. ఆవిడే.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్‌లలో డిగ్రీలు చేసినా, ప్రొఫెషనల్ పేయింటర్గా మారి పల్లెల్లోని వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న నైషితారెడ్డి కాసర్ల. 'పల్లెకు పోదాం' పేరిట ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో తను వేసిన చిత్రాలను ప్రదర్శించింది. తన పేయింటింగ్స్‌పై అమె మాటల్లోనే...
మనం నగర జీవితానికి అలవాటుపడిపోయి బీజీ జీవతంతో కుస్తీ పడుతుంటాం. మన ముందు తరం వాళ్లు ఆస్వాదించిన ఆనందాన్ని మనం మిస్ అవుతున్నాం. పల్లెలు, అక్కడ వారి రోజువారి జీవన విధానం గురించి ఎవరైనా చెబుతుంటే ఎంతగానో ప్రేరణపొందేదాన్ని. నా పెయింట్లలో అక్కడి వాతావరణాన్ని చూపించాలనుకున్నాను.
గొర్రెల కాపరి, బర్రెలు కాసేవారిజీవితాన్ని చూస్తే... వాటిని తీసుకొని వెళ్లి రావడం గమనిస్తే వారికున్న వనరులతో ఓ మంచి వాతారణంలో జీవితాన్ని గడుపుతారు. వాళ్లకు ఉన్నదాంట్లోనే ఎంతోగానో సంతృప్తిగా జీవిస్తారు. ఇబ్బందులు వాళ్లకు కూడా ఉంటాయి. రోజువారి జీవితంతో కుస్తీ పడుతూ ఉంటారు. అయినా వాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. పాటలు పాడుతూ, సరదాగా కబుర్లు చెబుతూ, చిన్న చిన్న పనులతో కష్టాలను మరిచిపోతారు.
బోనాలు అనేది మనకు చాలా పెద్ద పండగ. ఊళ్లోని అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో బోనాలు పండగ జరుపుకుంటారు. కొత్తగా వచ్చిన మెషిన్లను(గ్రాండర్లను) చూసినప్పుడు, పెద్దలు పల్లెల్లో వారు వాడిన ఇసురు రాయి గురించి చెప్పేవారు.
పల్లెల్లో కష్టపడి తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తారు. అదెంతో కష్టతరమైంది. ఆ పని చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. భవిష్యత్తులో ఈ పని చేయడానికి కూడా ఏవైనా మిషిన్లు కనిపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కష్టపడి పని చేసి వచ్చిన రైతు తాటికల్లు తాగి సేదతీరే దృశ్యమే ఈ పెయింటింగ్.
లేబర్ అనగానే మగవారు మాత్రమే అనే భావన సాధారణంగా అందరిలో ఉంటుంది. కానీ ఎలాంటి గుర్తింపులేకుండానే పల్లెల్లో మహిళలు కూడా ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటారు. చాట చెరగడం, బుర్రకథ చెప్పడం, వాగుదగ్గరికి వెళ్లి నీరు తీసుకురావడం, నెత్తిపై గడ్డి కట్ట మోయడం, నాటువేయడంలాంటి వాటిలో తెలియకుండానే నా పెయింటింగ్స్లలో మహిళవి ఎక్కువగా ఉన్నాయి.
మనం చిన్నప్పుడు గ్రామాల్లో చూసిన ఎన్నో నేడు కనిపించడం లేదు. ఇక తర్వాత తరం వారికి వాటి ఆనవాలు కూడా లేకుండా పోతాయేమో అనిపిస్తుంది. ఇలా ఆర్ట్ రూపంలో వేసి ఉంచితే అయినా వాటిని తర్వాత తరాల వారికి చూపించవచ్చు అని ఆలోచన. ఇక చిన్నప్పటి నుంచి ఇష్టమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇలా చిత్రాల్లోకి మలచడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. ఇంజినీరింగ్ చేసి ఇలా ఆర్టిస్ట్‌గా మారుతాను అనుకున్నప్పుడు అందరికంటే ఎక్కువ ఇంట్లో వాళ్లే సపోర్ట్ చెయ్యడం నా అదృష్టం.