మహిళా ప్రొఫెసర్ నిర్వాకం
న్యూఢిల్లీ: సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ మహిళా ప్రొఫెసర్ పదేళ్ల బాలుడి మరణానికి కారకురాలైంది. దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్గఢ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలు అనుపమ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ పై విడిచిపెట్టారు.
చావ్లా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి వికాస్ భరద్వాజ్ తెలిపాడు. ఆల్టో కారులో వెళుతున్న అనుపమ నియంత్రణ కోల్పోయి సైకిల్ పై వెళుతున్న నితీశ్ మాన్ అనే బాలుడిని ఢీకొట్టిందని చెప్పాడు. కారును ఆపలేకపోవడంతో నితీశ్ ను కొంత దూరం ఈడ్చుకుపోయిందని వెల్లడించాడు. తర్వాత అగర్వాల్ ను ఒప్పించి ఆమె కారులోనే బాలుడిని ఆస్పత్రికి తరలించామని, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని చెప్పాడు.
తన సోదరికి నూడూల్స్ తెచ్చేందుకు నితీశ్ బయటకి వెళ్లాడని, 10 నిమిషాల్లో తిరిగి వస్తానని చెప్పినట్టు అతడి తల్లి ముకేశ్ మాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంగవైక్యలంగా కారణంగా ఆయన ఎక్కువ సమయంలో ఇంట్లోనే ఉంటారు. తన భార్య కేటరింగ్ వ్యాపారం నడుపుతూ కుటుంబాన్ని ముకేశ్ పోషిస్తోందని తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు.