గిరిజనుల అభివృద్ధికి కృషి
మంత్రి నక్కా ఆనందబాబు
చాపరాయి బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ
రంపచోడవరం : గిరిజనుల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో బుధవారం చాపరాయి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుమూల గ్రామాలకు ఎనిమిది కిలోమీటర్లు మేర అనుసంధాన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. దశల వారీగా నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. చాపరాయి లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఇదోక గుణపాఠంగా తీసుకుని అన్ని మారుమూల ఆవాసాలకు అనుసంధాన రోడ్లు నిర్మించేందుకు 8వేల కిలోమీటర్ల మేర గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఒక్కో బాధితుని కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు ఒక్కో సంఘానికి రూ. 2లక్షలు చొప్పున స్త్రీనిధి, బ్యాంకులింకేజీ ద్వారా అందించారు. చాపరాయిలో మంజూరు చేసిన సామాజిక భద్రతా పింఛన్లు వచ్చే నెల నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ టీ రత్నబాయి, ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు పల్లాల రవణమ్మ, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు రమేష్, ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.