nakkala gandi project
-
'ప్రాజెక్టుల నిర్మాణంలో చట్ట ఉల్లంఘన లేదు'
► విభజన అనంతరం కొత్తవేవీ చేపట్టలేదని తెలంగాణ చెప్పింది ► అందువల్ల విభజన చట్టంలో ఉల్లంఘనేమీ లేదు- రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ : తాము జూన్ 2, 2014 తరువాత కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందువల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి జరుపుతున్నట్టు కాదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంసీ సి.ఎం.రమేశ్ సోమవారం రాజ్యసభలో అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో గల సెక్షన్ 84(3), 85(8) డి మరియు పేరా 7ను ఉల్లంఘిస్తూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఏదైనా వచ్చిందా? వస్తే ఈ పథకాలను ఆపేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేవీ అంటూ సి.ఎం.రమేశ్ ప్రశ్నించారు. దీనికి సన్వర్ లాల్ జాట్ సమాధానమిస్తూ ‘ఏపీ ప్రభుత్వం సంబంధిత అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక-ఆర్థిక అంచనా నివేదిక ఏదీ రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం 22.08.2015న ఒక లేఖ మాకు రాసింది. విభజన తేదీ అయిన 2 జూన్ 2014 తరువాత తాము ఏ కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొంది. అందువల్ల ఈ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అని పేర్కొన్నారు. -
దామరచర్లతోపాటే నక్కలగండికి శంకుస్థాపన
- ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం - పాలమూరు ఎత్తిపోతలపై మాత్రం ఇంకారాని స్పష్టత హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో నెలకొల్పనున్న దామరచర్ల విద్యుత్ ప్లాంటు, నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఒకేరోజు శంకుస్థాపన చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వచ్చే నెల 15లోగా వీటికి శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నక్కలగండి పథకం రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ప్రాజెక్టులో ఇతర ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేయించడంతో కాస్త ఆలస్యం జరిగింది. ప్రస్తుతం దీనిపై స్పష్టత రావడంతో పాలనా అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టాలని భావిస్తోంది. 7.64 టీఎంసీల సామర్థ్యం ఉండే నక్కలగండి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్‌డిండి ద్వారా అప్పర్ డిండి వరకు నీటిని తరలించేందుకు రూ.5,600ల కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో 11 టీఎంసీలు ఉండే మిడ్‌డిండి రిజర్వాయర్ కింద లక్ష ఎకరాలు, దీనికి 97 కిలోమీటర్ల దూరంలోని అప్పర్డిండి రిజర్వాయర్ కింద మరో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు రూ.750 కోట్లతో అంచనాలు వేసిన మిడ్‌డిండి రిజర్వాయర్, కాల్వల తవ్వకానికి తొలి ప్రాధాన్యమిచ్చి ఈ పనులకే శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. పాలమూరు ఎత్తిపోతలపై ఇంకా తర్జనభర్జన ఇక ప్రభుత్వం చేపడతామని చెబుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన విషయంలో ఇంకా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ముంపు నివారణ కసరత్తులు కొలిక్కి రాకపోవడంతో పనుల ఆరంభంపై స్పష్టత లేదు. ముంపు తగ్గింపుపై ఇంజనీర్ల బృందం ఓ నిర్ణయానికి వచ్చాకే దీనిపై ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశాలున్నాయి.