'ప్రాజెక్టుల నిర్మాణంలో చట్ట ఉల్లంఘన లేదు' | central government says there is no violation in telangana projects | Sakshi
Sakshi News home page

'ప్రాజెక్టుల నిర్మాణంలో చట్ట ఉల్లంఘన లేదు'

Published Mon, May 9 2016 7:31 PM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

central government says there is no violation in telangana projects

► విభజన అనంతరం కొత్తవేవీ చేపట్టలేదని తెలంగాణ చెప్పింది
► అందువల్ల విభజన చట్టంలో ఉల్లంఘనేమీ లేదు- రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ


న్యూఢిల్లీ :
తాము జూన్ 2, 2014 తరువాత కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందువల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి జరుపుతున్నట్టు కాదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంసీ సి.ఎం.రమేశ్ సోమవారం రాజ్యసభలో అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో గల సెక్షన్ 84(3), 85(8) డి మరియు పేరా 7ను ఉల్లంఘిస్తూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఏదైనా వచ్చిందా? వస్తే ఈ పథకాలను ఆపేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేవీ అంటూ సి.ఎం.రమేశ్ ప్రశ్నించారు.

దీనికి సన్వర్ లాల్ జాట్ సమాధానమిస్తూ ‘ఏపీ ప్రభుత్వం సంబంధిత అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక-ఆర్థిక అంచనా నివేదిక ఏదీ రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం 22.08.2015న ఒక లేఖ మాకు రాసింది. విభజన తేదీ అయిన 2 జూన్ 2014 తరువాత తాము ఏ కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొంది. అందువల్ల ఈ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement