నాలాలకు విముక్తి: సీఎం
- ఆక్రమణలు తొలగిస్తాం.. 24 గంటలూ నీరిస్తాం
- ‘స్వచ్ఛ హైదరాబాద్’ సమీక్షలో కేసీఆర్ వ్యాఖ్య
హైదరాబాద్: హైటెక్‌సిటీ సహా నగరంలో నిర్మించిన పలు బహుళ అంతస్తుల భవనాలకు అనుమతుల్లేవని, చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోనూ ఎన్నో ఆక్రమణలున్నాయన్నారు. నాలాలు నూరు శాతం కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను అవినీతిరహితంగా మార్చాలని అధికారులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు జరిగిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంపై ఉన్నతాధికారులందరితో శుక్రవారం హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.
చెత్త,నాలాలు, తాగునీరు-మురుగునీరు, పేదలకు గృహ సదుపాయం, ఇళ్లపై హైటెన్షన్ తీగలు వంటి సమస్యల్ని పరిష్కరించకుండా అందరం కలగంటున్న స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కాదని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. వీటిని స్వల్ప, దీర్ఘకాలిక పనులుగా విభజించి దశలవారీగా పరిష్కరించవచ్చన్నారు. ఎక్కడా రోడ్లపై చెత్త కనిపించరాదని, ఇళ్ల నుంచి చెత్త నేరుగా వాహనాల్లో డంపింగ్ యార్డులకు చేరుకోవాలని సూచించారు. ఇందుకోసం రిక్షాల బదులు 2500 ఆటో ట్రాలీలను ప్రభుత్వమే కొనుగోలు చేసి స్థానిక నిరుద్యోగులకు అప్పగిస్తుందన్నారు.
చెత్త నియంత్రణకు చట్టం
చెత్తను తరలించే వాహనాలకు స్వచ్ఛ వారధి లేదా స్వచ్ఛ సారథి అని తగిన పేరు పెట్టాలన్నారు. పొడిచెత్తతో విద్యుత్, తడి చెత్తతో కంపోస్టు ఎరువులు తయారు చేస్తామన్నారు. దుకాణాల నుంచి వెలువడే చెత్తను నియంత్రించేందుకు అవసరమైతే ఒక చట్టం తెస్తామన్నారు. చెత్త నిర్వహణను 2004లో రాంకీ సంస్థకు మూడు దశలుగా అప్పగించారని, తొలి రెండు దశలైన ఇంటి నుంచి చెత్త సేకరణ, ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలింపు జరగడం లేదని, మూడో దశ అయిన డంపింగ్‌యార్డులో నిర్వహణ మాత్రం జరుగుతోందన్నారు. రాంకీకున్న సాంకేతిక సామర్థ్యం తదితరాలను పరిశీలించి ఈ అంశాన్ని పరిష్కరిస్తామన్నారు.
ప్రతి ఇంటికి రెండు డబ్బాలు...
ఇళ్లలోనే తడి, పొడి చెత్త వేరుగా వేసేందుకు ప్రతి ఇంటికి రెండు రంగుల డబ్బాలను అందిస్తామని, వీటిని ఆటోట్రాలీల్లో తరలించేందుకు స్థానిక యువకులను ఎంపిక చేయాలన్నారు. రెండు నెలల్లో దీన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇళ్లపై హైటెన్షన్ విద్యుత్ లైన్ల తొలగింపు పనులు కూడా మొదలయ్యాయని సీఎం పేర్కొన్నారు.
24 గంటలపాటు నీటి సరఫరా
తాగునీరు, మురుగునీరు కలుస్తుండటంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, దీని పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలిక పనులు చేపడదామని కేసీఆర్ సూచించారు. నాలాల ఆక్రమణలే ఈ దుస్థితికి కారణమన్నారు. నగరంలోని 77 నాలాలకుగాను 72 నాలాలు నూరు శాతం ఆక్రమణల పాలయ్యాయన్నారు. అందుకు కారకులైన అప్పటి జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లకు చేతులెత్తి మొక్కాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ నెల 26న గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశమై ఆయా సమస్యల పరిష్కారానికి అంతిమ నిర్ణయం తీసుకుంటామన్నారు. నాలాలపై ఆక్రమణల తొలగింపునకు ఓ విధానం ఖరారు చేస్తామన్నారు.
పట్టుదలతో కలిసి పనిచేస్తే తప్పక ఫలితం ఉంటుందని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిరూపించిందన్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 35 టీఎంసీల నీరు వస్తుందన్నారు. నగరంలో కూడా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీటిని అందిస్తామన్నారు. 24 గంటలపాటు నీటిని సరఫరా చేసి కలుషిత జలాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని పేదలందరికీ ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామని, అవసరమైతే భూమిని కొంటామని సీఎం పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సఫాయికర్మచారీల వేతనాలను పెంచుతామని కూడా పేర్కొన్నారు. గోడలపై ఎక్కడా తనతో సహా ఎవరి పోస్టర్లు, రాజకీయ పార్టీల పోస్టర్లు ఉండరాదన్నారు. స్వచ్ఛ హైద రాబాద్‌కు మంచిపేరు వచ్చిందని, ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలతో మమేకమైన గవర్నర్ నరసింహన్, సీఎస్ రాజీవ్‌శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సిబ్బందిని అభినందించారు. కాగా, సమీక్ష సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై జీెహ చ్ఎంసీ కమిషనర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో గవర్నర్ నరసింహన్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కొత్త హైదరాబాద్‌ను చూస్తాం: గవర్నర్
స్వచ్ఛ హైదరాబాద్‌తో ప్రజల్లో మంచి కదలిక వచ్చిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో కొత్త హైదరాబాద్‌ను చూస్తామనే నమ్మకం తనకుందన్నారు. ప్రజలు వెల్లడించిన సమస్యల పరిష్కారానికి సీఎం వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయన్నారు. సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, జీహెచ్ఎంసీ కూడా బాగా పనిచేస్తుండటంతో ప్రజల్లో నమ్మకం కలుగుతోందని ప్రశంసించారు.