హైదరాబాద్ : నగరాన్ని ముంచెత్తిన వరదలను దృష్టిలో ఉంచుకుని వర్షాల నుంచి కోలుకున్నాక నాలాల ఆక్రమణలపై హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) దృష్టి పెట్టాలని నిర్ణయించింది. నాలాల ఆక్రమణల తొలగింపుపు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ సభ్యులుగా నాలాలపై అధ్యయనానికి ఓ ప్రత్యేక కమిటీని వేసింది.
ఈ కమిటీ పది రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది. శాటిలైట్ చిత్రాల ద్వారా నాలాల పరిస్థితిని అంచనా వేయాలని నిర్ణయించింది. ఆక్రమణల కేసును పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనుంది. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 26న జరిగే మంత్రివర్గం తీర్మానం చేయనుంది. అలాగే రోడ్ల నిర్మాణంపై ఏడాదంతా ప్రత్యేక దృష్టి పెట్టనుంది.